డేవిడ్ వార్నర్ వివాదంపై రాజేంద్రప్రసాద్ రియాక్షన్!
on Mar 25, 2025
'రాబిన్ హుడ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. రాజేంద్రప్రసాద్ పై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన క్షమాపణలు చెప్పారు. (David Warner)
నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'రాబిన్ హుడ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మార్చి 28న విడుదల కానుంది. ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ అతిథి పాత్ర పోషించాడు. మార్చి 23న 'రాబిన్ హుడ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా.. వార్నర్ గెస్ట్ గా హాజరయ్యాడు. అయితే ఈ వేడుకలో ఆయనకు ఊహించని అవమానం జరిగింది. (Robinhood)
'రాబిన్ హుడ్'లో కీలక పాత్ర పోషించిన రాజేంద్రప్రసాద్ ఈ ప్రీ ఈవెంట్ లో వార్నర్ గురించి మాట్లాడుతూ నోరు జారారు. "వెంకీ కుడుముల, నితిన్ కలిసి డేవిడ్ వార్నర్ ని పట్టుకొచ్చారు. ఈ వార్నర్ ని క్రికెట్ ఆడవయ్యా అంటే స్టెప్పులేస్తున్నాడు. దొంగ ముండా కొడుకు.. మామూలోడు కాదు. రేయ్ వార్నర్.. బి వార్నింగ్" అని రాజేంద్రప్రసాద్ అన్నారు. (Rajendra Prasad)
రాజేంద్రప్రసాద్ సరదాగా మాట్లాడుతున్నాను అనుకొని ఉండొచ్చు. కానీ, ఒక పబ్లిక్ ఈవెంట్ లో.. 'దొంగ ముండా కొడుకు' అని ఒక స్టార్ క్రికెటర్ ని అనడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ విషయంపై క్షమాపణలు చెబుతూ తాజాగా రాజేంద్రప్రసాద్ ఒక వీడియో రిలీజ్ చేశారు.
"నాకు వార్నర్ అంటే ఇష్టం. అతని క్రికెట్ అంటే ఇష్టం. అలాగే వార్నర్.. మన తెలుగు సినిమాలను, తెలుగు నటులను ఇష్టపడతాడు. మేము ఒకరికొకరం బాగా క్లోజ్ అయిపోయాం. నేను ఉద్దేశపూర్వకంగా అన్నది కాకపోయినా, జరిగిన సంఘటన వల్ల మీ మనసు బాధపడినట్లయితే.. మీ అందరికీ క్షమాపణలు." అని రాజేంద్రప్రసాద్ అన్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
