
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా నటుడు రాజీవ్ కనకాల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. ‘డ్రాగన్’ ఒక అణుబాంబులా ఉంటుందని ఆయన అన్నారు.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్.. ఈ నాలుగు పేర్లు కలిస్తే సినిమా ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని రాజీవ్ కనకాల అభిప్రాయపడ్డారు. ఈ సినిమా అభిమానులు రెండు కాలర్లు ఎగరేసుకునేలా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
‘డ్రాగన్’ సినిమా కోసం తాను ఇప్పటివరకు ఎనిమిది రోజుల పాటు షూటింగ్లో పాల్గొన్నట్లు రాజీవ్ కనకాల వెల్లడించారు. తన పాత్రకు సంబంధించిన మరికొంత షూటింగ్ ఇంకా చేయాల్సి ఉందని తెలిపారు.
దర్శకుడు ప్రశాంత్ నీల్ పనితీరును కూడా రాజీవ్ ప్రశంసించారు. ఆయనకు సన్నివేశం ఎలా ఉండాలి, నటీనటుల నుంచి ఎలాంటి నటన రాబట్టాలి అనే విషయాలపై స్పష్టత ఉంటుందని పేర్కొన్నారు. ఒక దర్శకుడికి తన కథపై పూర్తి అవగాహన ఉంటే నటీనటులు తమ పాత్రలను మరింత సులభంగా చేయగలరని వివరించారు.

‘డ్రాగన్’ కథ 1960ల కాలంలో గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతంలో సాగుతుంది. అంతర్జాతీయ ఓపియం అక్రమ రవాణా నేపథ్యంలో ఈ కథను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఎన్టీఆర్ ‘లూగర్’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆయన తన లుక్ను కూడా పూర్తిగా మార్చుకున్నారు.
రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా, అనిల్ కపూర్, బిజూ మీనన్, ఖుష్బూ సుందర్, గురు సోమసుందరం, అశుతోష్ రాణా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2027 జూన్ 11న విడుదల కానున్నట్లు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: ‘అదుర్స్’ బామ్మ కన్నుమూత.. 60 ఏళ్ల వయసులో సినిమాల్లోకి ఎంట్రీ.!
[Rajeev Kanakala About Dragon, Dragon Movie Atomic Bomb, NTR Dragon movie, NTR Prashanth Neel movie, Dragon Movie Updates, Jr NTR, Prashanth Neel, Rajeev Kanakala, Telugu Film News]




.webp)
