రాజమౌళి ఎనౌన్స్ చేసిన కొత్త సినిమా. డైరెక్టర్ ఎవరో తెలుసా?
on Sep 19, 2023
‘ఆర్‌ఆర్‌ఆర్’ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఓ కొత్త సినిమాను ఎనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా రాజమౌళి సమర్పణలో రూపొందనుంది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా ప్రకటించిన రాజమౌళి ఓ వీడియోను కూడా షేర్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజమౌళి కొత్త సినిమాను ఎనౌన్స్ చేస్తారని కొన్నిరోజులుగా వినిపిస్తోంది. అయితే అది తన డైరెక్షన్‌లో చేసే సినిమా గురించి అయి వుంటుందని అందరూ భావించారు. కానీ, తన సమర్పణలో రూపొందే ఓ బయోపిక్‌కి సంబంధించిన న్యూస్‌ను ప్రకటించారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఎస్.ఎస్.రాజమౌళి సమర్పకులుగా వ్యవహరిస్తారు.
భారతీయ సినిమా రంగం బయోపిక్‌గా ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాకి నితిన్ కక్కర్ దర్శకత్వం వహించనున్నారు. వరుణ్ గుప్తా, ఎస్.ఎస్.కార్తికేయ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, మరాఠి, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
రాజమౌళి ఈ సినిమా గురించి ట్విట్టర్‌లో తెలియజేస్తూ ‘నేను ఈ కథ విన్నప్పుడు ఎంతో భావోద్వేగానికి లోనయ్యాను. నన్ను బాగా కదిలించింది. బయోపిక్స్ చేయడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. అందులోనూ భారతీయ పితామహుడి గురించి ఆలోచన చేయడం మరింత సవాలుతో కూడుకున్నది. దానికి మా అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి గొప్ప సినిమాను సమర్పిస్తున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది’ అన్నారు.
ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటే మనకు గుర్తొచ్చే పేరు దాదా సాహెబ్ ఫాల్కే. ఆయన్ని భారతీయ సినిమా పితామహుడు అని పిలుచుకోవడం అందరికీ తెలిసిందే. ‘మేడ్ ఇన్ ఇండియా’ చిత్రాన్ని ఆయన బయోపిక్‌గా రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఇక రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోయే తదుపరి సినిమాలో సూపర్‌స్టార్ మహేష్ హీరోగా నటిస్తారని గతంలోనే ప్రకటించారు. అడ్వంచరస్ యాక్షన్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
Also Read