ప్రకాశ్‌రాజ్ మధ్యవర్తిత్వం.. నిందితులతో రాజీకి రాహుల్ సిప్లిగంజ్ సిద్ధం?
on Mar 10, 2020
ప్రిజమ్ పబ్‌లో మార్చి 4 రాత్రి సింగర్, బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ దాడికి గురైన వ్యవహారం సంచలనం సృష్టించింది. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి తమ్ముడు రితేశ్‌రెడ్డి, అతని స్నేహితులు రాహుల్‌పై దాడిచేసి, బీరు బాటిళ్లతో తలపై కొట్టడం, ముఖంపై పిడిగుద్దులు కురిపించడంతో అతని ముఖంపై గాయాలయ్యాయి. మరుసటి రోజు మధ్యాహ్యం అతను పోలీసులకు ఫిర్యాదు చేయగా, 324, 34 రెడ్‌విత్, 354 సెక్షన్ల కింద రితేశ్‌రెడ్డి, మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత రాహుల్ తనకు న్యాయం చేయమంటూ ట్వీట్ చేసి, దానిని మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేశాడు.
ఈ ఉదంతం తమ పార్టీకి చెడ్డపేరు తీసుకు వస్తుందనే ఉద్దేశంతో కేటీఆర్.. పార్టీ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్‌ను రంగంలోకి దించినట్లు సమాచారం. రాహుల్ పోలీసులకు ఫిర్యాదు చేసినందున రాజీ చేసుకుంటే మంచిదనీ, లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయని పైలట్ రోహిత్‌రెడ్డికి వినయభాస్కర్ సూచించడంతో మరో మాట లేకుండా ఆయనా సమ్మతించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రాహుల్‌ను వినయ్ భాస్కర్ దగ్గరకు ప్రకాశ్‌రాజ్ తీసుకువెళ్లారు. కేటీఆర్‌తో ప్రకాశ్‌రాజ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రస్తుతం ప్రకాశ్‌రాజ్ ప్రధాన పాత్రధారిగా కృష్ణవంశీ తీస్తున్న 'రంగమార్తాండ' చిత్రంలో రాహుల్ కూడా ఒక కీలక పాత్ర చేస్తున్నాడు. అందుకే ప్రకాశ్‌రాజ్ మధ్యవర్తిగా ఉండి, వినయ్ భాస్కర్ దగ్గరకు రాహుల్‌ను తీసుకుళ్లారు.
ఈ సందర్భంగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాల్సిందిగా రాహుల్‌కు వినయ్ భాస్కర్ సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అందుకు బదులుగా రితేశ్‌రెడ్డితో క్షమాపణ చెప్పిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు వినిపిస్తోంది. అలాగే ఇంకెప్పుడూ రితేశ్‌రెడ్డితో ఎలాంటి గొడవ కానీ, సమస్య కానీ తలెత్తదని కూడా ఆయన చెప్పారు. కేటీఆర్‌పై అభిమానం ఉంటే ఈ వ్యవహారాన్ని మరింత పెద్దది చేయవద్దని వినయ్ భాస్కర్ చెప్పడంతో రాహుల్ కూడా సరేనన్నట్లు సమాచారం. బహుశా అతి త్వరలోనే రాహుల్ పోలీసు కేసును విత్‌డ్రా చేసుకొనే అవకాశాలున్నాయి.