అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు రామ్ చరణ్.. షాకిచ్చిన పీపుల్స్ స్టార్!
on Feb 14, 2024
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అంటే అందరికీ ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ఆయన సినిమాలు సందేశాత్మకంగా ఉండటమే కాదు.. ఆయన జీవితం కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. జూనియర్ ఆర్టిస్ట్ గా ప్రయాణం మొదలుపెట్టి, హీరోగా మారి, పీపుల్స్ స్టార్ గా ఎదిగిన నారాయణమూర్తి.. విలువలే ఆస్తిగా బ్రతుకుతుంటారు. ఆయన తలచుకుంటే, ఇప్పుడు ఎందరో స్టార్ల సినిమాల్లో కీలక పాత్రలు పోషించి.. లక్షలు, కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ నారాయణమూర్తి ఆ పని చేయరు. అందుకే మిగతా నటులతో పోలిస్తే ఆయన ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తారు.
జూనియర్ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన 'టెంపర్' మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇందులో హెడ్ కానిస్టేబుల్ నారాయణమూర్తి అనే పాత్ర పోషించిన పోసాని కృష్ణమురళికి కూడా ఎంతో పేరు వచ్చింది. అయితే నిజానికి ఈ పాత్రని ఆర్ నారాయణమూర్తిని దృష్టిలో ఉంచుకొని పూరి రాసుకున్నాడు. అయితే ఈ పాత్ర కోసం నారాయణమూర్తిని సంప్రదించగా.. ఆయన సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఆ పాత్ర పోసానిని వరించింది. నారాయణమూర్తి చేయనప్పటికీ.. ఆ పాత్రకి నారాయణమూర్తి అనే పేరునే దర్శకుడు పూరి పెట్టడం విశేషం.
'టెంపర్' సినిమాలో తాను నటించకపోవడానికి గల కారణాన్ని గతంలోనే వివరించారు పీపుల్స్ స్టార్. తాను జూనియర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగానని.. ఎప్పటికీ హీరోగానే మిగిలిపోవాలి అనుకుంటున్నానని, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి అనుకోవడంలేదని చెప్పారు. నారాయణమూర్తి ఈ మాట చెప్పి తొమ్మిదేళ్లు అవుతుంది. ఇప్పటికీ ఆయన అదే మాట మీద నిలబడ్డారు.
రామ్ చరణ్ తన 16వ సినిమాని బుచ్చిబాబు దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం నారాయణమూర్తిని సంప్రదించగా ఆయన నో చెప్పారట. మూవీ టీం ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. ఆయన మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేనని స్పష్టం చేశారట. దీంతో నారాయణమూర్తి స్థానంలో మరో నటుడిని ఎంపిక చేసే పనిలో చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం. మొత్తానికి కోట్ల సంపాదనను కాదనుకొని తాను నమ్మినదానికి కట్టుబడి ఉంటున్న నారాయణమూర్తి తీరు కట్టిపడేస్తోంది.
Also Read