బాలయ్య-ప్రశాంత్ వర్మ కాంబోలో మూవీ.. ఫ్యాన్స్ కోరిక నెరవేరేనా?
on Oct 29, 2021
నటసింహం నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదిక ఆహాలో 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' పేరుతో ఓ టాక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో నవంబర్ 4 నుండి ప్రసారం కానుంది. ఈ షో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలయ్య అభిమానులు.. ఈ షో ప్రోమో చూశాక బాలయ్య- యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో సినిమా రావాలని ఆశ పడుతున్నారు.
'అన్ స్టాపబుల్' షోకి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజైంది. 'మన సంకల్పం గొప్పదైతే మనల్ని పంచభూతాలు కూడా ఆపలేవు' అంటూ 'అన్ స్టాపబుల్' టైటిల్ కి తగ్గట్లు చేసిన ఈ ప్రోమో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ ప్రోమోలో బాలయ్య స్టైల్, ఆటిట్యూడ్, డైలాగ్ డెలివరీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సినిమా కమర్షియల్ సినిమా ట్రైలర్ ను మించి ఉందంటూ.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బాలయ్య-ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో సినిమా రావాలని ఆశపడుతున్నారు. బాలయ్యను ఈమధ్య కాలంలో బోయపాటి శ్రీను మినహా ఏ దర్శకుడు అంతగా చూపించలేక పోతున్నారన్న నిరాశ ఫ్యాన్స్ లో ఉంది. అయితే ఇప్పుడు ప్రశాంత్ ఓ షో ప్రోమో కోసమే బాలయ్యని ఓ రేంజ్ లో చూపడంతో.. ఇక ఆయన బాలయ్యతో సినిమా చేస్తే ఏ రేంజ్ లో చూపిస్తాడోనని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. మరి ఫ్యాన్స్ కోరిక మేరకు వీరిద్దరి కాంబోలో మూవీ వస్తుందేమో చూడాలి.
అ!, కల్కి, జాంబి రెడ్డి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్.. ప్రస్తుతం 'హనుమాన్' మూవీ చేస్తున్నాడు. ఇక బాలయ్య విషయానికొస్తే.. బోయపాటితో 'అఖండ'తో పాటు గోపీచంద్ మలినేని తో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడితో ఓ ప్రాజెక్ట్ ఉంది.