మూవీ రూల్జ్ దెబ్బతో.. ‘సలార్’ దూకుడుకి కళ్లెం పడనుందా?
on Dec 23, 2023
పైరసీ అనేది సినిమాకి పట్టిన పెద్ద జాఢ్యంగా అందరూ అభివర్ణిస్తుంటారు. ఒక్కోసారి దాని ప్రభావం మరింత ఉధృతంగా ఉంటుంది. వందల కోట్లు ఖర్చు చేసి తీసిన సినిమాకి పైరసీ అడ్డుకట్ట వేయడం మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ పైరసీని అరికట్టడం ఎవ్వరి వల్లా కావడం లేదు. సినిమా రిలీజ్ అయిన రోజే నెట్లో సినిమా ప్రత్యక్షం కావడం భారీ చిత్రాల నిర్మాతలను కలవరపెడుతోంది. సినిమా కలెక్షన్లకు గండికొట్టే పైరసీదారుల ఆగడాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయని దర్శకనిర్మాతలు పలుమార్లు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
తాజాగా ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘సలార్’పై కూడా పైరసీ దారులు పంజా విసిరారు. మూవీ రూల్జ్ ‘సలార్’ హెచ్డి క్వాలిటీ ప్రింట్‌ను తమ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఇది ఇప్పుడు అందర్నీ కలవరపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధిస్తూ దూసుకెళ్తున్న ‘సలార్’ పైరసీ దెబ్బకు డీలా పడే అవకాశాలు కనిపిస్తున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఈ వెబ్సైట్ నుంచి లెక్కకు మించిన డౌన్లోడ్స్ జరిగినట్టు తెలుస్తోంది. పైసా ఖర్చు లేకుండా ప్రభాస్ కొత్త సినిమాను వీక్షించేందుకు నెటిజన్లు విరగబడుతున్నట్టు సమాచారం. కలెక్షన్లపరంగా కొత్త రికార్డులు క్రియేట్ చెయ్యాలని ‘సలార్’ వేగంగా దూసుకెళ్తున్న సమయంలో దాని దూకుడుకి మూవీ రూల్జ్ కళ్లెం వేసినట్టయింది. మరి దీనిపై ‘సలార్’ మేకర్స్ ఎలా స్పందిస్తారో.. చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
Also Read