వైరల్ అయిన షారుఖ్ లాంగ్ హెయిర్ 'పఠాన్' లుక్
on Nov 30, 2020
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రం 'పఠాన్' షూటింగ్ ఇటీవల ప్రారంభించాడు. ఈ మూవీకి 'వార్' ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. దీని షూటింగ్ ముంబైలోని యష్ రాజ్ స్టూడియోలో జరుగుతుంది. ఈ సందర్భంగా స్టూడియో బయట కెమెరాకు చిక్కిన షారుఖ్ ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్ను హోరెత్తిస్తున్నాయి. ఇది 'పఠాన్' లుక్ అంటూ ఫ్యాన్స్ ప్రచారం చేస్తున్నారు. ఆ ఫొటోల్లో కింగ్ ఖాన్ సరికొత్త లుక్‌లో పొడవుగా పెంచిన జుట్టుతో దర్శనమిస్తున్నాడు. 'పఠాన్' షూటింగ్‌కు సంబంధించి నిర్మాతలు ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయకపోయినా, చడీచప్పుడు లేకుండా దాని షూటింగ్ జరుగుతోందని రిపోర్టులు అందుతున్నాయి. షారుఖ్ తాజా రూపం మాత్రం అభిమానుల్ని అమితంగా ఆకట్టుకుంటున్నట్లు ట్విట్టర్‌లోని స్పందనలు తెలియజేస్తున్నాయి.
యాక్షన్ థ్రిల్లర్‌గా చెప్పబడుతున్న 'పఠాన్'ను యష్ రాజ్ పిలిమ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నాడు. షారుఖ్ లేటెస్ట్ లుక్ 'పఠాన్' సినిమాలోదే అనే విషయం అఫిషియల్‌గా తెలీకపోయినా ట్విట్టర్లో #Pathan అనే హ్యాష్‌ట్యాగ్ హల్చల్ చేస్తోంది. సోమవారం ఇది టాప్ ట్విట్టర్ ట్రెండ్స్‌లో ఒకటిగా నిలిచింది. దీపికా పడుకోనే హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీలో జాన్ అబ్రహాం ఓ కీలక పాత్ర చేస్తున్నాడు.
'పఠాన్' కాకుండా, రాజ్‌కుమర్ హిరాణీతో ఓ సోషల్ కామెడీ, తమిళ డైరెక్టర్ అట్లీతో ఓ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్నాడు షారుఖ్. అలాగే అలీ అబ్బాస్ జాఫర్, రాజ్ అండ్ డీకే డైరెక్షన్లలోనూ సినిమాలు చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
Also Read