ఐశ్వర్యా రాయ్ అందంపై కవిత రాసిన పార్తీపన్
on Sep 26, 2022
మణిరత్నం లేటెస్ట్ ఎపిక్ 'పొన్నియిన్ సెల్వన్-1' సెప్టెంబర్ 30న పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఇందులో నందిని అనే పాత్రలో ఐశ్వర్యా రాయ్ నటించారు. ఆమె పెద్ద పళువెట్టరాయర్ పాత్రధారి శరత్‌కుమార్ భార్యగా కనిపించనున్నారు. కాగా ఇదే మూవీలో చిన్న పెళువెట్టరాయర్‌గా నటించిన పార్తీపన్.. ఆ ఇద్దరితో కలిసి తీసుకున్న ఫొటోలను తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. తన వదినగా నటించిన ఐశ్వర్యపై తమిళంలో ఆయన ఓ కవిత కూడా రాశారు.
సినిమాల్లో నటించాలనే తన అభిరుచిని కొనసాగించడానికి తన అందాన్నీ, ఆరోగ్యాన్నీ కాపాడుకుంటున్న వైనాన్ని పార్తీపన్ ప్రశంసించాడు. ఇంగ్లిష్ లిపిలో తమిళ డైలాగ్స్‌ను కంఠస్థం చేయడం, ఎలాంటి అహం లేకుండా ఎన్ని టేకులు కావాలంటే అన్ని టేకులు నటించగల ఆమె సామర్థ్యాన్ని కూడా తన కవితలో ఆయన ప్రస్తావించాడు.
'పీఎస్1'లో తన ప్రియుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి పరితపించే నందిని పాత్రను చేశారు ఐశ్వర్య. చోళ రాజ్యంలో శక్తిమంతమైన పాలకుడైన పెద్ద పళువేట్టరాయర్‌ను ఆమె పెళ్లాడుతుంది. తంజావూరు కోట పరిరక్షకుడైన చిన్న పళువేట్టరాయర్‌గా పార్తీపన్ నటించాడు. తన తండ్రి తర్వాత చోళ రాజ్యానికి రాజు కావాలని ఆశించే ఆదిత్య కరికాలన్ (విక్రమ్)ను అడ్డుకోవాలని ఆ ముగ్గురూ నిర్ణయించుకుంటారు. అందుకు ఇతర సామంత రాజుల మద్దతును కూడగడతారు.
రెండు భాగాల 'పొన్నియిన్ సెల్వన్' మూవీలో జయం రవి, త్రిష, కార్తీ, ఐశ్వర్య లక్ష్మి, శోభిత దూళిపాళ, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రలు చేశారు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం, రవివర్మన్ ఛాయాగ్రహణం, తోట తరణి కళా దర్శకత్వం అందించిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలవుతోంది.
Also Read