Om Shanti Shanti Shantihi Review: ‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీ రివ్యూ
on Jan 30, 2026
.webp)
తారాగణం: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, బ్రహ్మాజీ, బ్రహ్మానందం, సురభి ప్రభావతి, శివన్నారాయణ, రోహిణి తదితరులు
సంగీతం: జే క్రిష్
డీఓపీ: దీపక్ యెరగరా
ఎడిటర్: ఏఆర్ సజీవ్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఏఆర్ సజీవ్
నిర్మాతలు: సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ
బ్యానర్స్: ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్
విడుదల తేదీ: జనవరి 30, 2026
ఈ ఓటీటీ యుగంలో రీమేక్ చేయడం అనేది సాహసమే. ఆ సాహసమే 'ఓం శాంతి శాంతి శాంతిః' టీమ్ చేసింది. 2022 లో వచ్చిన మలయాళ హిట్ మూవీ 'జయ జయ జయ జయహే'కు రీమేక్ ఇది. ఆ మూవీ ఓటీటీలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఇప్పటికే చాలామంది చూసేశారు. అయినప్పటికీ దానిని తెలుగు ప్రేక్షకుల కోసం సరికొత్తగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే..? (Om Shanti Shanti Shantihi Movie Review)
కథ:
గోదావరి ప్రాంతానికి చెందిన మధ్య తరగతి అమ్మాయి ప్రశాంతి (ఈషా రెబ్బా). చిన్నప్పటి నుంచి ఆంక్షల మధ్యే పెరుగుతుంది. అమ్మాయి అంటే పెద్దలు చెప్పింది వినాలి, పద్ధతిగా ఉండాలి, పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళాలి. ఇంతకు మించి ఆమె స్వతంత్రంగా ఏమీ చేయకూడదనే కుటుంబ వాతావరణంలో పెరుగుతుంది ప్రశాంతి. చదువులో ఆమె టాపర్ అయినప్పటికీ ఇంట్లోవాళ్ళు ఏమాత్రం ప్రోత్సహించకుండా, లోకల్ లో ఉండే చిన్న కాలేజీలో డిగ్రీలో చేర్పిస్తారు. అక్కడ లెక్చరర్ తో ప్రేమలో పడుతుంది ప్రశాంతి. ఈ విషయం తెలిసి హడావుడిగా ఓంకర్ నాయుడు (తరుణ్ భాస్కర్) అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు తల్లిదండ్రులు. కోపిష్టి, అహంకారం కలిగిన వ్యక్తి అయిన నాయుడు.. ప్రశాంతిని లోకువగా చూస్తాడు. మంచి పనైనా, చిన్న పనైనా సరే.. మొగుడి అనుమతి లేకుండా ఏం చేయకూడదు అనే రకం. అంతేకాదు ప్రశాంతిపై చీటికీ మాటికీ చేయి చేసుకుంటాడు. కొంతకాలం భరించిన ప్రశాంతి.. ఒకానొక దశలో సహనం నశించి, భర్తను తిరిగి కొడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? భార్య ఎదురుతిరగడంతో నాయుడు ఏం చేశాడు? భర్తకు బుద్ధి చెప్పడం కోసం ప్రశాంతి ఏం చేసింది? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
భార్య భర్తలు మధ్య గిల్లికజ్జాలతో తెరకెక్కే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి బాగానే ఆదరణ ఉంటుంది. అదే 'జయ జయ జయ జయహే'ను తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచన మేకర్స్ వచ్చేలా చేసినట్టుంది. అయితే తెలుగులో ఓటీటీలో అందుబాటులో ఉండటం, ఇప్పటికే చాలామంది చూసేయడంతో.. అదే సినిమాకి మెయిన్ మైనస్ గా మారింది.
'ఓం శాంతి శాంతి శాంతిః' చూస్తుంటే ఒక కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ కలగదు. 'జయ జయ జయ జయహే'నే దాదాపు దింపేశారు. కథాకథనాల్లో, సన్నివేశాల్లో ఫ్రెష్ నెస్ పెద్దగా కనిపించదు. అయితే ఈ కథకు గోదావరి నేపథ్యం తీసుకోవాలనే ఆలోచన బాగుంది. కానీ ఆ నేపథ్యాన్ని సహజంగా తెర మీదకు తీసుకురావడంలో మాత్రం తడబడ్డారు. ఆర్టిస్టుల బాడీ ల్యాంగ్వేజ్, ల్యాంగ్వేజ్ లో సహజత్వం ఉట్టిపడలేదు. ఒరిజినల్ లో హీరోది పౌల్ట్రీ వ్యాపారమైతే, ఇందులో హీరోది చేపల చెరువు. అలాగే హీరోయిన్ కి జీడి పండు ట్రాక్ ని జోడించారు. ఇలా కొన్ని కొన్ని మార్పులు మాత్రమే చేశారు.
అయితే ఒరిజినల్ చూడని వారికి మాత్రం 'ఓం శాంతి శాంతి శాంతిః' కొంతవరకు నచ్చే అవకాశముంది. మగాడు అనే అహంకారం అణువణువునా ఉన్న భర్తపై భార్య తిరగబడితే ఎలా ఉంటుంది? అనే లైన్ చాలు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి కనెక్ట్ కావడానికి. ఆద్యంతం వినోదభరితంగా సాగుతుంది. అదే సమయంలో స్త్రీని ఎలా చూడాలనే సందేశం ఇచ్చారు. భర్త నుంచి భార్య కోరుకునేది.. స్వేచ్ఛ, స్వతంత్రం, సమానత్వం అని చెప్పించారు.
ప్రశాంతి, ఓంకర్ నాయుడు పాత్రల పరిచయం, వారి పెళ్లితో సినిమా ప్రారంభమవుతుంది. ప్రశాంతి తన బాధ్యతగా ఇంట్లో అన్ని పనులు చేస్తున్నా.. నాయుడు మాత్రం చిన్న చూపు చూడటం, చేయి చేసుకోవడం చేస్తుంటాడు. చూసీ చూసీ సరైన సమయంలో భర్తకు ఎదురుతిరుగుతుంది ప్రశాంతి. భార్య కొట్టడంతో నాయుడు ఏం చేస్తాడు? అనే ఆసక్తిని కలిగిస్తూ ఫస్ట్ హాఫ్ ని ముగిస్తారు. ఫస్ట్ హాఫ్ లో కామెడీ బాగానే వర్కౌట్ అయింది. అక్కడక్కడా తడబాటు కనిపించినా సెకండాఫ్ లో కూడా కామెడీ బాగానే పండింది. ముఖ్యంగా హీరో మేనమామగా బ్రహ్మాజీ డైలాగ్స్ బాగానే నవ్వులు పూయించాయి. పతాక సన్నివేశాల్లో జడ్జిగా బ్రహ్మానందం కనిపించడం మాత్రం.. జాతి రత్నాలు సినిమాను గుర్తు చేసింది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
రీమేక్ లో నటించడం అంత తేలికైన విషయం కాదు. ఒరిజినల్ నటులను ఇమిటేట్ చేసినట్టుగా ఉండకుండా, తమ మార్క్ చూపించగలగాలి. ఆ పరంగా తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ఇద్దరూ బాగానే కష్టపడ్డారు. గోదావరి యాస మాట్లాడటంలో తరుణ్ కాస్త ఇబ్బందిపడినట్టు కనిపించినా.. నాయుడు పాత్రకు న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. ఇక ఈ కథ హీరోయిన్ కోణంలోనే ఉంటుంది. ఒక రకంగా సినిమాని భుజాలపైన మోయాలి. అలాంటి కీలకమైన ప్రశాంతి పాత్రలో ఈషా బాగానే ఒదిగిపోయింది. ఇక హీరో మామగా బ్రహ్మాజీ బాగానే నవ్వించాడు. బ్రహ్మానందం, సురభి ప్రభావతి, శివన్నారాయణ, రోహిణి తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతికంగా సినిమా పరవాలేదు. జే క్రిష్ తన సంగీతంతో పూర్తిస్థాయిలో మ్యాజిక్ చేయలేకపోయినప్పటికీ, పరవాలేదు అనిపించుకున్నాడు. దీపక్ సినిమాటోగ్రఫీ, మూవీ జానర్ కి తగ్గట్టుగా కలర్ ఫుల్ గా ఉంది. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. డైలాగ్స్ బాగున్నాయి. కొన్ని నవ్వించేలా ఉంటే, కొన్ని ఆలోచింపజేసేలా ఉన్నాయి. "ఆడపిల్లకు రెక్కలు ఇవ్వాలి. కానీ, మన ఇంటి మీదే ఎగిరేలా చూసుకోవాలి" వంటి డైలాగ్ లను కథలోని భావాన్ని తెలుపుతూ లోతైన అర్థంతో రాశారు.
ఫైనల్ గా..
స్త్రీలకు విలువ ఇవ్వాలనే సందేశమిచ్చే సరదా సినిమా ఈ 'ఓం శాంతి శాంతి శాంతిః' . ఒరిజినల్ మూవీ 'జయ జయ జయ జయహే' చూడని వారికి నచ్చే అవకాశముంది. ఒరిజినల్ చూసిన వారికి మాత్రం కొత్త సినిమా చూసిన అనుభూతి కలగదు.
రేటింగ్ : 2.25/5
Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



