అఫిషియల్.. 'ఆచార్య' విడుదల కూడా వాయిదా పడింది
on Apr 27, 2021
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తోన్న 'ఆచార్య' మూవీ విడుదల అధికారికంగా వాయిదా పడింది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని మే 13న విడుదల చేస్తున్నట్లు ఇదివరకు నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దేశంలో నెలకొన్న కొవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల కారణంగా సినిమా విడుదలను వాయిదా చేస్తున్నట్లు, పరిస్థితులు చక్కబడగానే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామనీ నిర్మాతలు నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ ప్రకటించారు.
'ఆచార్య'లో చిరంజీవి సరసన జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, స్పెషల్ జోడీగా రామ్‌చరణ్, పూజా హెగ్డే కనిపించనున్నారు. ఒక పీరియడ్ స్టోరీతో యాక్షన్ డ్రామాగా ఈ మూవీని కొరటాల శివ రూపొందిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తుండగా, ఎస్. తిరునావుక్కరుసు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. జనవరిలో విడుదల చేసిన టీజర్‌కు 20 మిలియన్ వ్యూస్ లభించాయి. అలాగే మణివర్మ స్వరాలు కూర్చగా, రామజోగయ్య శాస్త్రి రచించిన "లాహే లాహే" లిరికల్ వీడియోకు 26 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
లాక్‌డౌన్ కాలంలో మూతపడిన థియేటర్లు 9 నెలల తర్వాత తెరుచుకున్నాయనే ఆనందం అంతలోనే ఆవిరయ్యేలా.. కరోనా సెకండ్ వేవ్ సునామీలా దేశాన్ని చుట్టుముట్టింది. దాన్ని కొంతమేరకు నిలువరించే ఉద్దేశంతో తెలుగు రాష్ట్రాలు రాత్రివేళ కర్ఫ్యూను విధించాయి. దీంతో కేవలం రెండు షోలతో థియేటర్లు నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఏ రకంగానూ ప్రయోజనకరం కాదనే ఉద్దేశంతో థియేటర్లను మూసివేస్తున్నట్లు థియేటర్ల సంఘాలు ప్రకటించాయి. దీంతో అనివార్యంగా తమ సినిమాలను వాయిదా వేసుకుంటూ వస్తున్నారు నిర్మాతలు. అదే బాటలో 'ఆచార్య' మూవీని కూడా వాయిదా వేశారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
