న్యూ ఇయర్ గిఫ్ట్.. 'నువ్వు నాకు నచ్చావ్' రీ-రిలీజ్!
on Dec 14, 2025

ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని ఎవర్గ్రీన్ ఎంటర్టైనర్స్ లో 'నువ్వు నాకు నచ్చావ్'(Nuvvu Naaku Nachav) ఒకటి. 24 ఏళ్ళ క్రితం 2001 సెప్టెంబర్ 6న విడుదలైన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ సినిమాని ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు. రిపీట్ వేల్యూ ఉన్న కంటెంట్ ఇది. అంతలా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన ఈ మూవీ.. ఇప్పుడు మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. 2026 జనవరి 1న ప్రపంచ వ్యాప్తంగా 4K లో రీ రిలీజ్ అవుతోంది.
'నువ్వు నాకు నచ్చావ్' సినిమా తీస్తున్నప్పుడే నిర్మాత స్రవంతి రవికిశోర్ ఇది ఒక గొప్ప సినిమా అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. విక్టరీ వెంకటేష్ ని సరికొత్త పంథా లో ఆవిష్కరించిన సినిమా ఇది. ‘నువ్వే కావాలి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ భాస్కర్- త్రివిక్రమ్ ఫుల్ జోష్ తో చేసిన సినిమా ఇది. అప్పటికే త్రివిక్రమ్ కి ‘మాటల మాంత్రికుడు’ అనే ఇమేజ్ వచ్చేసింది. ఇప్పటకీ ఈ సినిమాలోని డైలాగ్స్ మార్మోగుతూనే ఉన్నాయి.
ఇక కోటి సంగీతం, సిరివెన్నెల- భువన చంద్ర ల సాహిత్యం ఎవర్ గ్రీన్. ఆర్తి అగర్వాల్ ఇప్పుడు మన మధ్య లేకపోయినా, ఎప్పటికీ గుర్తుండి పోతారు. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, సునీల్, చంద్ర మోహన్, ఎంఎస్ నారాయణ.. ఇలా చెప్పుకుంటూ పోతే అందరివీ గుర్తుండిపోయే పాత్రలే.
'నువ్వు నాకు నచ్చావ్' రీ-రిలీజ్ సందర్భంగా నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ.. “ తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయి అయిన “నువ్వు నాకు నచ్చావ్” ఇప్పుడు 4K లో తిరిగి థియేటర్లలోకి వస్తోంది. ఇది కేవలం రీ-రిలీజ్ కాదు. జనవరి 1, 2026 – కొత్త సంవత్సరాన్ని కుటుంబంతో కలిసి నవ్వులు పూయిస్తూ ప్రారంభించడానికి ఇదే సరైన సమయం. 25 ఏళ్లుగా రకరకాల మాధ్యమాల్లో ఆస్వాదిస్తున్న ఈ అనుభూతిని ఇప్పుడు థియేటర్ల లో సంపూర్ణంగా ఆస్వాదించండి.” అన్నారు.
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ కి తెలుగునాట ప్రత్యేక క్రేజ్ ఉంది. త్రివిక్రమ్ రచయితగా పని చేసిన మొదటి వెంకటేష్ మూవీ 'నువ్వు నాకు నచ్చావ్' కావడం విశేషం. అలాగే, త్రివిక్రమ్ దర్శకుడిగా మొదటిసారి ఇప్పుడు వెంకటేష్ తో 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47' అనే సినిమా చేస్తున్నాడు. ఆ చిత్రం 2026 లోనే విడుదల కానుంది. అలాంటిది ఇప్పుడు 2026 కొత్త సంవత్సరం 'నువ్వు నాకు నచ్చావ్' రీ-రిలీజ్ తో ప్రారంభమవుతుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



