దేవర కంటే వర పవర్‌ఫుల్.. ‘దేవర2’ పాయింట్ రివీల్ చేసిన ఎన్టీఆర్!
on Apr 2, 2025
గత ఏడాది సెప్టెంబర్ 27న పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో విడుదలైన ఎన్టీఆర్ మూవీ ‘దేవర’ సంచలన విజయం సాధించింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉందని ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. పార్ట్ 1ను 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు పైగా వసూళ్ళు సాధించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల్ని, అభిమానుల్ని మెస్మరైజ్ చేశారు. అలాగే ఈ సినిమాకి బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఓ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎన్టీఆర్ ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. సినిమా క్లైమాక్స్‌లో దేవరని అతని కొడుకు వర చంపినట్టుగా చూపించారు. ఈ సినిమాకి అదే పెద్ద ట్విస్ట్‌గా మారింది. దాన్ని రెండో భాగంలో రివీల్ చేస్తారని తెలుస్తోంది.
ప్రస్తుతం హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్2’ చిత్రంలో నటిస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మరో పక్క ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘డ్రాగన్’ చిత్రంలో కూడా నటిస్తున్నారు ఎన్టీఆర్. అలాగే జైలర్ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో కూడా ఒక సినిమా ఉందని తెలుస్తోంది. అయితే వార్2, డ్రాగన్ చిత్రాలు పూర్తయిన తర్వాత నెల్సన్ సినిమా స్టార్ట్ అవుతుందా లేక దేవర2 చిత్రాన్ని పట్టాలెక్కిస్తారా అనేది తెలియాల్సి ఉంది. సహజంగానే ప్రశాంత్ నీల్ సినిమా పూర్తి కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆ లెక్కన దేవర2 ఎప్పుడు ప్రారంభిస్తారు అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. దేవర కంటే వార్2, డ్రాగన్ చిత్రాల్లోని ఎన్టీఆర్ క్యారెక్టర్స్ మోస్ట్ పవర్‌ఫుల్‌గా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాల తర్వాత ప్రారంభమయ్యే దేవర2లో వర క్యారెక్టర్ ఇంకెంత పవర్‌ఫుల్‌గా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. వర క్యారెక్టర్ గురించి ప్రేక్షకులకు, అభిమానులకు ఎన్టీఆర్ ఒక హింట్ ఇచ్చారు.
‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంతో జపాన్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్న ఎన్టీఆర్‌కు అక్కడ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మార్చి 28న జపాన్‌లో ‘దేవర’ చిత్రాన్ని విడుదల చేశారు. డైరెక్టర్ కొరటాల శివతో కలిసి ఆ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు ఎన్టీఆర్. అక్కడి అభిమానులు తనపై చూపించిన ప్రేమకు ఎన్టీఆర్ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ప్రమోషన్స్‌లో భాగంగానే ఎన్టీఆర్, కొరటాల శివ అక్కడి మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలోనే దేవర2 గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు ఎన్టీఆర్ సమాధానమిచ్చారు. ‘ఫస్ట్ పార్ట్‌లో మీరు చూసిన కథ కొంత మాత్రమే. సెకండ్ పార్ట్ దీన్ని మించి ఉంటుంది. మరింత భారీతనం కనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్‌లో మీరు దేవర గురించి తెలుసుకున్నారు. సెకండ్ పార్ట్‌లో వర గురించి తెలుసుకుంటారు. అతను సామాన్యమైన వ్యక్తి కాదు అనేది ఎంతో అద్భుతంగా తెరకెక్కించేందుకు శివ కసరత్తు చేస్తున్నారు. వర క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది అనేది స్క్రీన్‌పైనే చూడాలి. దేవర, వర మధ్య ఏం జరిగింది అనే ఇంట్రెస్టింగ్ అంశాలు సినిమాకి ఎంతో కీలకం కాబోతున్నాయి’ అంటూ ఎన్టీఆర్ తెలిపిన వివరాలు ‘దేవర2’పై ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా పెంచుతున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్‌కి వున్న కమిట్‌మెంట్స్‌ని బట్టి చూస్తే ఈ సీక్వెల్ ప్రారంభం కావడానికి మరో రెండేళ్ళు పట్టేలా ఉంది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
