ఎన్టీఆర్ కెరీర్‌ను మలుపుతిప్పిన 'పాతాళభైరవి' తెరవెనుక కథ
on May 27, 2021
తోటరామునిగా ఎన్టీ రామారావు, నేపాళ మాంత్రికుడిగా ఎస్వీ రంగారావును ఎంచుకొని విజయా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె.వి. రెడ్డి దర్శకత్వంలో 'పాతాళభైరవి' చిత్రాన్ని ప్రారంభించారు నిర్మాతలు నాగిరెడ్డి-చక్రపాణి. ఈ సినిమా కోసం వాహినీ స్టూడియోలో ప్రత్యేకంగా కర్రసాము నేర్చుకున్నారు ఎన్టీఆర్. అప్పుడు విజయవాడ ప్రధాన కేంద్రంగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీలన్నీ విజయవాడలోనే ఉండేవి. కొత్త చిత్రం విడుదలైతే ముందురోజు అర్ధరాత్రి తర్వాత విడుదల కాబోయే సినిమా ప్రదర్శన ఏర్పాటుచేసి ఊళ్లో తమకు ముఖ్యులైన పెద్దలను ఆహ్వానించడం డిస్ట్రిబ్యూటర్స్ పెట్టుకున్న ఓ ఆనవాయితీ. 'పాతాళభైరవి' సినిమా పూర్తయ్యాక విడుదలకు ముందురోజు అర్ధరాత్రి తర్వాత విజయవాడ ప్రముఖులను కొంతమంది ఆహ్వానించి షో వేశారు విజయా పిక్చర్స్, డిస్ట్రిబ్యూటర్స్.
మరుసటి రోజు ఉదయం 6 గంటలకు విజయా పిక్చర్స్ మేనేజర్ సత్యం మద్రాసులో ఉన్న నాగిరెడ్డి, చక్రపాణిలకు ఫోన్ చేశారు. రాత్రి చూసినవాళ్లు మూడు నాలుగు వారాల పిక్చర్ అని చెప్పారని తెలిపారు. దాంతో నాగిరెడ్డి, చక్రపాణి నీరుగారిపోయారు. 'పాతాళభైరవి' ఫ్లాపయితే, మరో సినిమా తీసే ఆర్థిక స్తోమత కంపెనీకి లేదు! ఉదయం 9 గంటకు కె.వి. రెడ్డి వాహినీ స్టూడియోకు వెళ్లారు. ఆఫీసులో డల్‌గా కూర్చొని కనిపించారు నాగిరెడ్డి, చక్రపాణి.
"ఏంటి బ్రదర్? ఏంటి అలా ఉన్నారు? ఏం జరిగింది?" అని అడిగారు కె.వి. రెడ్డి. "ఏం లేదు బ్రదర్" అని నాగిరెడ్డి అన్నారు విషయం చెప్పకుండా. చక్రపాణి గారిది ముక్కుసూటి మనస్తత్వం. ఉన్నదున్నట్లు మాట్లాడేస్తారు. "రాత్రి పాతాళభైరవి చూశారట. మూడు నాలుగు వారాల పిక్చర్ అన్నారట. విజయవాడ నుంచి సత్యం ఫోన్ చేశాడు." అని చెప్పారు చక్రపాణి.
కె.వి. రెడ్డికి పట్టరాని కోపం వచ్చింది. విజయవాడకు అప్పటికప్పుడు ట్రంక్ కాల్ చేసి మేనేజర్ సత్యంతో, "నా పర్మిషన్ లేకుండా పిక్చర్ షో వేయడానికి నువ్వెవడివి? నీకెవరు అధికారం ఇచ్చారు? నేను సినిమా తీసింది టిక్కెట్ కొని సినిమా చూసే ప్రేక్షకుల కోసం కానీ, నువ్వు చూపించిన కాంప్లిమెంటరీ క్లాస్ వాళ్లక్కాదు. సాయంత్రం టిక్కెట్ కొని చూసే ప్రేక్షకులు ఏమంటారో ఆ విషయం చెప్పు." అని విసురుగా ఫోన్ పెట్టేశారు.
1951 మార్చి 15న పాతాళభైరవి రిలీజయ్యింది. విజయవాడలోనూ, మిగతా కేంద్రాల్లోనూ కూడా యావరేజ్ పిక్చర్ అనేదే టాక్. మాంత్రికుడు (ఎస్వీ రంగారావు) చనిపోవడంతోనే కథ అయిపోయిందనీ, కానీ మళ్లీ బతికించి కథను సాగదీశారనీ చెప్పుకున్నారు. అయితే మూడు వారాల తర్వాత పరిస్థితి మారిపోయింది. కలెక్షన్లు పెరుగుతూ పోయి, హౌస్‌ఫుల్ బోర్డులు పడటం మొదలైంది. 13 కేంద్రాల్లో విడుదలైన ఈ సినిమా 10 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. కర్నూలు, భీమవరం, విశాఖపట్నంలలో 91 రోజులు ఆడింది. విజయవాడ దుర్గా కళామందిరంలో 33 వారాలు ఆడింది. 11 వారాల తర్వాత ప్రింట్ల సంఖ్య 60కి పెరగడం విశేషం.
తోటరామునిగా నటించిన రామారావు అందచందాలు, ఆయన అభినయం ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. ఎన్టీఆర్ కెరీర్‌ను మలుపుతిప్పిన మొట్టమొదటి చిత్రంగా 'పాతాళభైరవి' చరిత్రలో నిలిచింది.
Also Read