‘నింద’ మూవీ రివ్యూ
on Jun 21, 2024
సినిమా పేరు: నింద
తారాగణం: వరుణ్ సందేశ్, తనికెళ్ళ భరణి, ఛత్రపతి శేఖర్, మధు, శ్రేయ రాణి రెడ్డి, యాని, మైమ్ మధు, భద్రం, సూర్య కుమార్ తదితరులు
సంగీతం: సాంతు ఓంకార్
డీఓపీ: రమీజ్
ఎడిటర్: అనిల్ కుమార్
రచన, దర్శకత్వం: రాజేష్ జగన్నాథం
నిర్మాత: రాజేష్ జగన్నాథం
బ్యానర్: ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్
విడుదల తేదీ: జూన్ 21, 2024
అప్పట్లో 'హ్యాపీ డేస్', 'కొత్త బంగారు లోకం' వంటి విజయవంతమైన సినిమాలతో మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా కనిపించిన వరుణ్ సందేశ్.. ఆ తర్వాత వరుస పరాజయాలతో వెనకబడిపోయాడు. కాస్త గ్యాప్ తర్వాత ఇప్పుడు 'నింద' అనే క్రైమ్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? వరుణ్ కి కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
కాండ్రకోట గ్రామంలో మంజు అనే అమ్మాయిని అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. ఈ నేరం అదే గ్రామానికి చెందిన బాలరాజు (ఛత్రపతి శేఖర్) చేశాడని పోలీసులు అరెస్ట్ చేస్తారు. బాలరాజే నేరం చేశాడని ఆధారాలు కూడా ఉండటంతో.. జడ్జి సత్యానంద్ (తనికెళ్ల భరణి) అతనికి ఉరిశిక్ష విధిస్తాడు. అయితే రిటైర్ అయ్యాక బాలరాజు నేరం చేయలేదని తెలుసుకున్న సత్యానంద్.. తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చాననే బాధతోనే కన్నుమూస్తాడు. అయితే తన చివరి రోజుల్లో ఈ విషయాన్ని హ్యూమన్ రైట్స్ కమిషన్ అధికారి అయిన తన కొడుకు వివేక్ (వరుణ్ సందేశ్)కి చెప్తాడు. అసలు ఆ నేరం చేసింది ఎవరు? ఈ కేసుని వివేక్ ఎలా ఛేదించాడు? బాలరాజుకి ఉరిశిక్ష పడకుండా వివేక్ అడ్డుకోగలిగాడా? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
వంద మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ.. ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనేది ఒక ధర్మ సూత్రం. కానీ అది మాటలకే పరిమితమవుతుంది. ఎందరో నిర్దోషులకు, అమాయకులకు శిక్ష పడటం మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం. అలాంటి వాటి నుంచి స్ఫూర్తి తీసుకొని ఈ చిత్ర కథ రాసుకున్నట్టుగా ఉంది. పక్కా ఆధారాలు ఉండటంతో తనకి తెలియకుండానే ఒక నిర్దోషికి జడ్జి ఉరి శిక్ష విధించడం, ఆ తరువాత నిజం తెలిసి ఆ కేసుని ఛేదించడానికి జడ్జి కొడుకు రంగంలోకి దిగడం అనేది నిజంగా ఆసక్తికర కథాంశం. ఆ పాయింట్ కి తగ్గట్టుగా.. తరువాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠను రేకెత్తిస్తూ, ఊహించని మలుపులతో కథనం రాసుకుంటే సినిమా హిట్టే. అయితే దర్శకుడు ఎంచుకున్న కథాంశం ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, దానిని అంతే ఆసక్తికరంగా తెరమీదకు తీసుకురావడంతో పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు.
ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి.. ఆరుగురిని కిడ్నాప్ చేసి, మంజు హత్య కేసులో నిజం రాబట్టాలని చేసే ప్రయత్నంతో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. అయితే కథ ముందుకు వెళ్లే కొద్దీ.. కథనం నెమ్మదిగా సాగుతుంది. సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం మెప్పించింది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే, సెకండ్ హాఫ్ మెరుగ్గా ఉంది. మంజు, బాలరాజు ఎవరు? కిడ్నాప్ అయిన వ్యక్తులతో ఈ కేసుకి సంబంధం ఏంటి? వంటి విషయాలను రివీల్ చేస్తూ సెకండ్ హాఫ్ నడిచింది. పతాక సన్నివేశాలు మెప్పించాయి. క్లైమాక్స్ ట్విస్ట్ ఆకట్టుకుంది. ఫస్టాఫ్ మీద, స్క్రీన్ ప్లే మీద మరింత ఫోకస్ పెట్టినట్లయితే.. అవుట్ పుట్ ఇంకా మెరుగ్గా ఉండేది.
టెక్నికల్ గా నింద సినిమా బాగానే ఉంది. రమీజ్ కెమెరా పనితనం ఆకట్టుకుంది. సాంతు ఓంకార్ నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగానే ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
నటీనటుల పనితీరు:
ఎక్కువగా లవర్ బాయ్ పాత్రలతో అలరించే వరుణ్ సందేశ్.. హ్యూమన్ రైట్స్ కమిషన్ అధికారిగా కొత్తగా కనిపించాడు. సెటిల్డ్ పర్ఫామెన్స్ తో ఆ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. బాలరాజుగా ఛత్రపతి శేఖర్, మంజుగా మధు వారి పాత్రలకు న్యాయం చేశారు. తనికెళ్ళ భరణి, శ్రేయ రాణి రెడ్డి, యాని, మైమ్ మధు, భద్రం, సూర్య కుమార్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
ఫైనల్ గా..
నింద మంచి ప్రయత్నమే. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా ఒకసారి చూడొచ్చు.
రేటింగ్: 2.5/5

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
