నిహారిక పెళ్లి ఎప్పుడు? ఎక్కడ? అంటే...
on Nov 4, 2020
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు కుమార్తె, హీరోయిన్ నిహారికా కొణిదెల పెళ్లి వేదిక, వేడుక తేదీ ఖరారు చేశారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో గుంటూరు ఐజి జె. ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో ఆమెకు నిశ్చితార్ధం జరిగిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలోనే ఆమె మెడలో అతను మూడు ముళ్లు వేయనున్నాడు.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల ఉదయ్ విలాస్‌లో వచ్చే నెల డిసెంబర్ 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు చైతన్య జోన్నలగడ్డతో నిహారికా కొణిదెల వివాహం జరగనుంది. పెళ్లి వేడుక తేదీతో పాటు పెళ్లి వేదికను ఇటీవలే ఖరారు చేశారు. వివాహ ఆహ్వాన పత్రికలను సైతం ముద్రించారు. పెళ్లి పత్రికలను తిరుమల తిరుపతి ఏడుకొండల వెంకటేశ్వరస్వామి పాదాల వద్ద ఉంచి స్వామి ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్లిన వరుడు చైతన్య తండ్రి ప్రభాకర్ రావు ఈ విషయాలు మీడియాకి చెప్పారు. సో... నిహారిక పెళ్లికి మెగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఉదయ్‌పూర్ వెళ్లడానికి రెడీ అవుతున్నారన్నమాట. ఇదీ డెస్టినేషన్ వెడ్డింగ్ అనే చెప్పాలి.