నెటిజన్ చేసిన పనికి శ్వేతావర్మ సీరియస్.. వీడియో ద్వారా వార్నింగ్!
on Apr 24, 2024
ప్రస్తుతం సోషల్ మీడియా ఎంతో పవర్‌ఫుల్‌గా మారింది. దాని వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో, అనర్థాలూ అన్నే ఉన్నాయి. కొందరు దాన్ని సక్రమంగా వినియోగిస్తుంటే, మరికొందరు దుర్వినియోగం చేస్తున్నారు. అలాంటి వారి వల్ల ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పుడప్పుడు ఇలాంటి వారికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉంటాయి. తాజాగా ఓ కామాంధుడి బండారాన్ని బట్టబయలు చేసింది శ్వేతావర్మ.
బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా శ్వేతావర్మ ఎంతో పాపులర్ అయిన విషయం తెలిసిందే. గతంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ శ్వేతకు అంతగా గుర్తింపు రాలేదు. బిగ్‌బాస్ సీజన్ 5లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆమె ఉనికి అందరికీ తెలిసింది. ఈ షో వల్ల వచ్చిన గుర్తింపుతో సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. హీరోయిన్‌గానూ కొన్ని సినిమాల్లో నటించింది. అయితే ఇప్పుడు ఆ అవకాశాలు కూడా సన్నగిల్లాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలేవీ లేవు. అయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటోంది. తన అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటూ అన్ని విషయాలనూ షేర్ చేసుకుంటోంది.
ఇటీవల ఇన్‌స్టాలో శ్వేత పెట్టిన పోస్ట్ అందర్నీ షాక్‌కి గురి చేసింది. సోషల్ మీడియాలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి ఆ స్టోరీలో చెప్పుకొచ్చింది. ఓ అజ్ఞాత వ్యక్తి తనకు అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతూ తనను వేధిస్తున్నాడని పేర్కొంది. తన ప్రైవేట్ పార్ట్‌లపై నీచంగా చేసిన కామెంట్స్ తననెంతో బాధించాయని చెబుతోంది. ఆ వ్యక్తి పంపిన మెసేజ్‌లతోపాటు అతని ప్రొఫైల్‌ని స్క్రీన్ షాట్ తీసి ఇన్‌స్టాలో షేర్ చేసింది.
‘నాగరికత ఇంతగా పెరిగిన ఈరోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నందుకు ఎంతో సిగ్గు పడుతున్నాను. ఒక సాటి మనిషి గురించి ఇలాంటి కామెంట్ చేయాలని ఎలా అనిపిస్తుంది? రేపు వాళ్ళ అమ్మకి కూడా ఇలాంటి మెసేజ్‌లు ఎవరైనా పంపితే ఎలా ఫీల్ అవుతాడు? ఊరుకుంటాడా?’ అని తను తాజాగా చేసిన వీడియోలో ప్రశ్నించింది. ఆ వ్యక్తి అడ్రస్‌తోపాటు కాంటాక్ట్ వివరాలు కూడా సేకరించానని, వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చెయ్యొచ్చు కానీ, తాను మనిషిని కాబట్టి ఆ పని చెయ్యలేకపోయాను అంటోంది. తాను ఈ విషయాలన్నీ బహిర్గతం చేయడం అతనికి గుణపాఠంలాంటిదని, ఇకనైనా ఇలాంటి నీచమైన పనులు చేయకుండా ఉంటే మంచిదని హెచ్చరించింది.
Also Read