ఏడు ఆస్కార్లతో సత్తా చాటిన నెట్‌ఫ్లిక్స్!
on Apr 26, 2021
ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ 93వ అకాడమీ అవార్డుల్లో 7 ఆస్కార్లను గెలుచుకోవడం ద్వారా సత్తా చాటింది. హాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థల్లో ఏదీ ఇన్ని ఆస్కార్లను గెలవలేదు. దీంతో తను అందిస్తోన్న కంటెంట్ ఎంత క్వాలిటీదో మరోసారి చాటిచెప్పింది నెట్‌ఫ్లిక్స్. అయితే బెస్ట్ పిక్చర్ కేటగిరీలోనూ, యాక్టింగ్ కేటగిరిల్లోనూ ఈ ప్రొడక్షన్ హౌస్‌కు మొండిచేయి ఎదురయ్యింది. అన్ని స్టూడియోలతో పోల్చుకుంటే ఈ సంస్థ 36 నామినేషన్లతో అగ్రస్థానంలో బరిలో నిలిచింది.
డేవిడ్ ఫించెర్ డైరెక్షన్‌లో నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన 'మాంక్' మూవీకి రెండు ఆస్కార్లు లభించాయి. ఒకటి సినిమాటోగ్రఫీ (ఎరిక్ మెస్సర్‌షిమిత్)లో, మరొకటి ప్రొడక్షన్ డిజైన్ (డోనాల్డ్ గ్రాహమ్ బర్ట్, జాన్ పాస్కలే)లో. ఈ ఏడాది అత్యధిక నామినేషన్లు పొందిన సినిమా 'మాంక్'. దీనికి మొత్తం 10 నామినేషన్లు దక్కాయి.
అలాగే 'మా రైనీస్ బ్లాక్ బాటమ్'కు కూడా రెండు ఆస్కార్లు.. మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్ (మియా నీల్, జమికా విల్సన్, సెర్గియో లోపెజ్-రివేరా), కాస్ట్యూమ్ డిజైన్ (ఆన్ రోత్).. లభించాయి. వీటితో పాటు అది నిర్మించిన 'మై ఆక్టోపస్ టీచర్' బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ అవార్డును, 'టూ డిస్టాంట్ స్ట్రేంజర్స్' బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ అవార్డు, 'ఇఫ్ ఎనీథింగ్ హాపెన్స్ ఐ లవ్ యు' బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ అవార్డు సొంతం చేసుకున్నాయి.
ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీని పక్కన పెడితే మిగతా 23 ఆస్కార్ల కేటగిరీలకు గాను 22 కేటగిరీల్లో నెట్‌ఫ్లిక్స్ కనీసం ఒకటైనా నామినేషన్ సాధించడం మరో విశేషం. 2020లో 24 నామినేషన్లు సాధించిన నెట్‌ఫ్లిక్స్ చివరకు 2 అవార్డులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి భారీ స్థాయిలో నామినేషన్లతో పాటు, అత్యధిక సంఖ్యలో అవార్డులనూ సాధించిన సంస్థగా నిలిచింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
