'NBK 109' టైటిల్ టీజర్.. ఊరమాస్ అప్డేట్!
on Nov 12, 2024
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తన 109వ సినిమాని బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. 'NBK 109' అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతోంది. 'అఖండ', 'వీరసింహ రెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో 'NBK 109'పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ఆకట్టుకొని.. సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ వచ్చింది. (NBK 109 Title Teaser)
నవంబర్ 15న 'NBK 109' టైటిల్ టీజర్ విడుదల కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. విభిన్న దుస్తులు ధరించి, ప్రత్యేకంగా రూపొందించిన ఆయుధాలను చేతబట్టిన బాలకృష్ణ లుక్ ఎంతో పవర్ ఫుల్ శక్తివంతంగా ఉంది. నెత్తురంటిన గొడ్డలిని పట్టుకొని, పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో బాలకృష్ణ నిల్చొని ఉన్న రూపం మరో స్థాయిలో ఉంది.
'NBK 109' సినిమా టైటిల్ గా 'డాకూ మహారాజా', 'సర్కార్ సీతారామ్' వంటి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మరి వీటిలో దేన్నయినా లాక్ చేశారో లేక ఏదైనా కొత్త టైటిల్ ఎంపిక చేశారో అనేది నవంబర్ 15న తేలిపోనుంది.
ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్ లో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, 'జైలర్' ఫేమ్ విజయ్ కార్తీక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఎడిటర్ గా నిరంజన్, ప్రొడక్షన్ డిజైనర్ గా అవినాష్ కొల్లా వ్యవహరిస్తున్నారు.
Also Read