ఇంత ఘోరమా.. ‘హిట్3’తో వారికి దూరమవుతున్న నాని!
on Apr 25, 2025
టాలీవుడ్ హీరోల్లో నానికి ఒక డిఫరెంట్ ఇమేజ్ ఉంది. బాయ్ నెక్స్‌ట్ డోర్ అనిపించుకొని అన్నివర్గాల ప్రేక్షకుల్ని, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నారు. తన సహజమైన నటనతో నేచురల్ స్టార్ అని పిలిపించుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకైనా ఇమేజ్‌ని, ఫ్యాన్ ఫాలోయింగ్‌ని పెంచేవి మాస్ అండ్ యాక్షన్ మూవీసే. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాస్ ఇమేజ్‌ని సొంతం చేసుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు నాని. అయితే అవేవీ వర్కవుట్ కాలేదు. ఆ క్రమంలో కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు కూడా చేశాడు. కానీ, అతన్ని సెన్సిబుల్ సినిమాల్లోనే చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడ్డారు. చివరికి ‘దసరా’ చిత్రంతో అతని కోరిక తీరింది. ఈ సినిమాలో నాని ఫుల్ మాస్ క్యారెక్టర్ చేశాడు. సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయింది. దాంతో ఆ ఫార్మాట్‌లోనే తన తదుపరి సినిమాలు కూడా చెయ్యాలని డిసైడ్ అయినట్టున్నాడు. అందుకే ఆమధ్య ‘సరిపోదా శనివారం’ అంటూ మరో మాస్ యాక్షన్ మూవీ చేశాడు. అది కూడా కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది. దీని తర్వాత ‘హిట్3’తో మరింత డోస్ పెంచి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నాని.
స్వీయ నిర్మాణంలో ప్రారంభించిన ‘హిట్’ సిరీస్‌కి మంచి ఆదరణ లభించింది. ‘హిట్ ద ఫస్ట్ కేస్’, ‘హిట్ ద సెకండ్ కేస్’ చిత్రాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ సిరీస్‌కి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. మొదటి రెండు సినిమాల్లో విశ్వక్ సేన్, అడివి శేష్ హీరోలుగా నటించగా, ఇప్పుడు వస్తున్న ‘హిట్3’లో స్వయంగా నాని రంగంలోకి దిగాడు. మొదటి రెండు భాగాల్లో ఒక కేస్ ఇన్వెస్టిగేషన్‌తోపాటు ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే అంశాలతో రూపొందించారు. కానీ, ‘హిట్3’ విషయానికి వస్తే.. ఇందులో హింస, రక్తపాతం ఎక్కువగా ఉన్నట్టు ట్రైలర్‌లో అర్థమైంది. ఇప్పటివరకు నాని చేసిన సినిమాల్లో అత్యధికంగా వయొలెన్స్ ఉన్న సినిమా ఇదే అనిపించింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నేచురల్ స్టార్ నుంచి వయొలెన్స్ స్టార్‌గా నాని ఎదిగాడని అందరూ అనుకుంటున్నారు. ఈ సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాలో హింస అధికంగా ఉందని భావించిన సెన్సార్ సభ్యులు ‘ఎ’ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. 13 సంవత్సరాల లోపు పిల్లలు ఈ సినిమాకి దూరంగా ఉండాలని సెన్సార్ సభ్యులు సూచిస్తున్నారు.
2008లో ‘అష్టాచమ్మా’ సినిమాతో హీరోగా పరిచయమైన నాని.. ఆ తర్వాత కూడా అలాంటి సెన్సిబుల్ మూవీస్ చేస్తూ యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణతో నేచురల్ స్టార్‌గా ఎదిగారు. ‘దసరా’ చిత్రంతో యాక్షన్ హీరోగా మారిన తర్వాత ఆ తరహా సినిమాలు చేసేందుకే నాని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని అర్థమవుతోంది. అయితే తనని నేచురల్ స్టార్‌ని చేసి ఒక ఇమేజ్ అందించిన ఫ్యామిలీ ఆడియన్స్‌కి ‘హిట్3’తో దూరం కాబోతున్నాడు. ఎందుకంటే హింస, రక్తపాతం ఎక్కువగా ఉన్న సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసేందుకు ఇష్టపడరు. అందులోనూ ఈ సినిమాకి పిల్లల్ని దూరంగా ఉంచాలని సెన్సార్ చేసిన సూచనను పాటించేందుకైనా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్‌కి రావడం తగ్గుతుంది. ఇప్పటివరకు తనకు అండగా ఉన్న ఒక వర్గం ఆడియన్స్ ‘హిట్3’తో దూరం కాబోతున్నారనేది వాస్తవం. కేవలం యూత్, మాస్ ఆడియన్స్ ఈ సినిమాకి ఎలాంటి విజయాన్ని చేకూరుస్తారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



