తెలుగు '83'ని ప్రెజెంట్ చేస్తోన్న నాగార్జున
on Jan 23, 2020
భారత క్రికెట్ జట్టు తొలిసారి విశ్వ విజేతగా నిలిచిన 1983 వరల్డ్ కప్ నేపథ్యంలో బాలీవుడ్లో రూపొందుతోన్న చిత్రం '83'. అప్పటి భారత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్ నటిస్తోన్న ఈ చిత్రానికి కబీర్ ఖాన్ డైరెక్టర్. తెలుగులో ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున సమర్పిస్తున్నారు. హిందీలో ఈ మూవీని రిలయెన్స్ ఎంటర్టైన్మెంట్, కబీర్ ఖాన్ ఫిలిమ్స్, 83 ఫిలిమ్స్ లిమిటెడ్, ఫాంటం ఫిలిమ్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలవుతుండగా, తెలుగు వెర్షన్‌ను అన్నపూర్ణ స్టూడియోస్, రిలయెన్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా విడుదల చేస్తున్నాయి.
ఈ విషయాన్ని నాగార్జున తెలియజేస్తూ, "క్రికెట్ జగత్తులో 1983లో మన దేశం గొప్ప విజయాన్ని సాధించింది. ఈ విజయంతో మన దేశంలో క్రికెట్ ఓ మతం అనేంత గొప్పగా మమేకమైంది. ఈ ప్రయాణం గురించి చెప్పే చిత్రమే '83'. ఈ జర్నీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్రికెట్ ప్రపంచంలో విశ్వవిజేతగా ఉన్న వెస్టిండీస్ జట్టును ఓడించి భారతదేశం తొలిసారి క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఈ సినిమాను తెలుగులో మా సంస్థ ద్వారా విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది" అని చెప్పారు.
దర్శకుడు కబీర్‌ఖాన్ మాట్లాడుతూ "ఓ ఫిలిం మేకర్‌గా నాగార్జునగారంటే నాకు ఎంతో గౌరవం. మా సినిమాను అంత గొప్ప వ్యక్తి సహకారంతో తెలుగులో విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. '83' చిత్రం తప్పకుండా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుంది" అన్నారు.
ఈ చిత్రంలో రణవీర్ సింగ్ (కపిల్ దేవ్), తాహిర్ రాజ్ బాసిన్ (సునీల్ గవాస్కర్), హార్డీ సంధు (మదన్‌లాల్), షకీబ్ సలీమ్ (మొహీందర్ అమర్నాథ్), అమ్మీ విర్క్ (బల్వీందర్ సింగ్ సంధు), జీవా (కృష్ణమాచారి శ్రీకాంత్), చిరాగ్ పాటిల్ (సందీప్ పాటిల్), సాహిల్ కత్తార్ (సయ్యద్ కిర్మాణి), ఆదినాథ్ కొఠారి (దిలీప్ వెంగ్‌సర్కార్), ధైర్య కార్వా (రవిశాస్త్రి), దినేకర్ శర్మ (కీర్తి ఆజాద్), జతిన్ శర్మ (యశ్పాల్ శర్మ), నిశాంత్ దహియా (రోజర్ బిన్నీ), ఆర్.బద్రి (సునీల్ వాల్సన్), బోమన్ ఇరాని (ఫరూక్ ఇంజనీర్), పంకజ్ త్రిపాఠి (పి.ఆర్. మాసింగ్) నటిస్తున్నారు. ఈ చిత్రంలో కపిల్‌దేవ్ భార్య రోమీ పాత్రలో దీపికా పడుకోనే నటిస్తున్నారు.