‘పుష్ప2’ రిలీజ్ టైమ్‌లో అల్లు అర్జున్‌పై నాగబాబు సంచలన ట్వీట్!
on Dec 4, 2024
ప్రస్తుతం దేశమంతా పుష్ప2 మేనియాలో ఉంది. మరికొద్ది గంటల్లో పుష్పరాజ్ థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులే కాదు, ఇండస్ట్రీ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ అవుతుండగా, ఒకరోజు ముందే అంటే డిసెంబర్ 4 రాత్రి నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శనలు ప్రారంభం కాబోతున్నాయి. భారీ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అవుతున్న పుష్ప2 ఇప్పుడు అన్నిచోట్లా చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే.. గత కొన్ని నెలలుగా బన్నీకి, మెగా ఫ్యామిలీకి మధ్య కొన్ని మనస్పర్థలు, అభిప్రాయ భేదాలు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. అల్లు అర్జున్ కొత్త సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో దానికి మెగా అభిమానుల నుంచి ఎలాంటి వ్యతిరేకత ఉంటుందోననే ఆసక్తికరమైన చర్చ కూడా జరిగింది. అసలు సినిమా రిలీజ్ అనేది సజావుగా జరుగుతుందా లేదా అనే సందేహం కూడా అందరికీ కలిగింది. కానీ, అనూహ్యంగా ఈరోజు హీరో సాయిధరమ్‌తేజ్ ‘పుష్ప2’ టీమ్‌కి విషెస్ చెబుతూ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వాలని ఆశిస్తూ బన్నికి, సుకుమార్‌కి, యూనిట్‌లోని సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ట్వీట్ వేశారు.
తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కూడా ట్విట్టర్ ద్వారా తన సందేశాన్ని పంపారు. అయితే ‘పుష్ప2’ పేరును ప్రస్తావించకుండా ట్వీట్ వేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ‘24 క్రాప్ట్స్ కష్టంతో, వందల మంది టెక్నీషియన్స్ శ్రమతో, వేల మందికి ఉపాధి కల్పిస్తూ కోట్ల మందిని అలరించేదే సినిమా. అందుకే ప్రతి సినిమా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరినీ అలరించే సినిమాలనే ఆదరించాలని ప్రతి మెగా అభిమానిని, ప్రతి సినిమా అభిమానినీ కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. మెగా అభిమానుల వల్ల ‘పుష్ప2’ చిత్రానికి అంతరాయం కలిగే అవకాశం ఉందని ముందు నుంచీ అందరూ భావిస్తున్నారు. అలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగానే నాగబాబు ఈ ట్వీట్ చేశారని అర్థమవుతోంది. ‘పుష్ప2’ పేరును ప్రస్తావించకపోయినా ఈ ట్వీట్ ద్వారా మెగా అభిమానులు సంయమనం పాటించాలని పరోక్షంగా చెప్పారనేది స్పష్టంగా తెలుస్తోంది.