ఈసారి సంక్రాంతి ముందే వచ్చింది.. డిసెంబర్‌లోనే 13 సినిమాల రిలీజ్!
on Nov 30, 2024
తెలుగు వారికి సంక్రాంతి పెద్ద పండగ. అలాగే తెలుగు సినిమాలకు కూడా పెద్ద పండగ సంక్రాంతే. కొన్ని దశాబ్దాలుగా పెద్ద హీరోల సినిమాలు సంక్రాంతికి విడుదలవుతున్నాయి. వాటి మధ్యలో కొన్ని చిన్న సినిమాలు కూడా విడుదలై సంచలన విజయాలు సాధిస్తున్నాయి. అయితే ఈసారి మాత్రం వచ్చే ఏడాది రావాల్సిన సంక్రాంతి ఈ ఏడాది చివరలోనే వచ్చినట్టు కనిపిస్తోంది. దాదాపు 13 సినిమాలు డిసెంబర్‌లోనే విడుదల కాబోతున్నాయి. వాటిలో పెద్ద సినిమాలు, ఓ మాదిరి సినిమాలు, చిన్న సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నీ ఒకేసారి రిలీజ్ అవ్వడం వల్ల థియేటర్ల కొరత అనేది తప్పకుండా ఉంటుంది. అలాగే ఆడియన్స్ కూడా సెలెక్టివ్‌గా సినిమాలు చూసే అవకాశం ఉంది. మరి విడుదలవుతున్న ఆ సినిమాల వివరాలేమిటో ఒకసారి పరిశీలిద్దాం.
డిసెంబర్ నెల పుష్ప రూల్‌తో ప్రారంభం కాబోతోంది. డిసెంబర్ 5న ‘పుష్ప2’ రిలీజ్ అవుతోంది. పుష్ప ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు సెకండ్ పార్ట్ దాన్ని మించే రీతిలో రూపొందించారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్, ప్రీ బుకింగ్స్‌లో రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు పుష్ప. ఈ సినిమా తర్వాత ఓ రెండు వారాలపాటు మరో సినిమా రిలీజ్ అవ్వడం లేదు. అంటే ఆ రెండు వారాలు పుష్ప2 కలెక్షన్లు కుమ్మేస్తుంది అనడంలో సందేహం లేదు. మిగతా సినిమాలు క్రిస్మస్ సీజన్‌కి వెళ్లిపోయాయి. డిసెంబర్ 20న అల్లరి నరేష్ ‘బచ్చలమల్లి’, ప్రియదర్శి కొత్త సినిమా ‘సారంగపాణి జాతకం’, ఉపేంద్ర హీరోగా నటించి దర్శకత్వం వహించిన ‘యుఐ’, విజయ్ సేతుపతి సినిమా ‘విడుదల పార్ట్2’, ది లయన్ కింగ్‌కి ప్రీక్వెల్‌గా వస్తున్న ‘ముఫాసా’, రాజేంద్రప్రసాద్ మనవరాలు తేజస్విని నటించిన ‘ఎర్రచీర’.. ఇవన్నీ డిసెంబర్ 20నే విడుదలవుతున్నాయి.
దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అంతా కొత్తవారితో చేసిన ‘మ్యాజిక్’ చిత్రం డిసెంబర్ 21న రాబోతోంది. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో రూపొందిన ‘రాబిన్‌హుడ్’ డిసెంబర్ 25న రిలీజ్ అవుతోంది. తమిళ్‌లో విజయ్ హీరోగా రూపొందిన తెరి చిత్రానికి హిందీ రీమేక్ అయిన ‘బేబి జాన్’ తెలుగులో కూడా రిలీజ్ అవుతోంది. డిసెంబర్ 27న ‘పతంగ్’ అనే ఓ చిన్న సినిమా వస్తోంది. ఈ సినిమాలన్నింటిలోనూ ‘పుష్ప2’పైనే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయనేది వాస్తవం. పుష్ప సాధించిన ఘనవిజయంతో పుష్ప2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ పుష్ప చిత్రంలోని అల్లు అర్జున్ నటనకు ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు అందుకున్న విషయం కూడా తెలిసిందే. దాంతో ఈ సినిమాకి ఓపెనింగ్స్ భారీగా ఉండబోతున్నాయని అర్థమవుతోంది.
మిగతా సినిమాల్లో సూపర్‌స్టార్ మహేష్ వాయిస్ ప్రధానంగా వస్తున్న ‘ముఫాసా’ చిత్రంపై కూడా ఒక వర్గం ప్రేక్షకుల అంచనాలు ఉన్నాయి. లయన్‌కింగ్ తెలుగులో కూడా భారీ విజయం సాధించడంతో ముఫాసాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇక ఉపేంద్ర హీరోగా నటించి దర్శకత్వం వహించిన ‘యుఐ’ చిత్రం కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే గతంలో ఉపేంద్ర రూపొందించిన సినిమాలను ప్రేక్షకులు ఎంతో కొత్తగా ఫీల్ అయ్యారు. ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో సినిమాలు తీసే ఉపేంద్ర.. ఈసారి కూడా అలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్నాడని టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది. మరి కొన్నిరోజుల్లో మొదలయ్యే ఈ సినిమాల జాతరలో ఏ సినిమాకి ప్రేక్షకులు పట్టం కడతారు, ఏ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుంది అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.