ఏపీలో సినిమా టికెట్ ధరల వ్యవహారం.. పదిమంది సభ్యులతో కమిటీ!
on Dec 28, 2021

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల వ్యవహారం చాలా రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. సినిమా టికెట్ల ధరలను మునుపటి రేట్ల కంటే మరింత తగ్గించడంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు గగ్గోలు పెడుతున్నారు. పలు థియేటర్లను యాజమాన్యాలు మూసివేస్తున్నాయి. 'అఖండ', 'పుష్ప', 'శ్యామ్ సింగ రాయ్' సినిమాలకు మిగతా ఏరియాల్లో మంచి కలెక్షన్లు వస్తుండగా, ఏపీలో మాత్రం అవి తీసికట్టుగా ఉండటం ప్రత్యక్షంగా కనిపిస్తోన్న వాస్తవం. టికెట్ ధరలు అతి తక్కువగా ఉండటం వల్లే డిస్ట్రిబ్యూటర్ల ఆదాయానికి భారీ స్థాయిలో గండిపడుతోంది. వారు నష్టాల బాటలోకి వెళ్తున్నారు. ఎగ్జిబిటర్లు కూడా తాము ఈ రేట్లతో థియేటర్లు నడపలేమని చెప్తున్నారు. ఫలితంగా వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం ఎందుకింత కఠినంగా వ్యవహరిస్తోందో అర్థం కావడం లేదని చిత్రసీమకు చెందిన అన్ని వర్గాల వారు అంటున్నారు.
దీంతో ఈ సినిమా టికెట్ల వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకురావడానికి తెలుగుచిత్ర పరిశ్రమ పెద్దలు నడుం బిగించారు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం కానరాకపోవడంతో టికెట్ల ధరల విషయంలో తుది నిర్ణయం తీసుకోవడానికి మరోసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో సమస్యను కొలిక్కి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఛైర్మన్‌గా పదిమంది సభ్యుల కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ టికెట్ల వ్యవహారంపై అందరితో చర్చించి ప్రభుత్వానికి ఓ రిపోర్టును అందజేయనుంది.
అలాగే మంత్రి పేర్ని నానితో నేడు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సమావేశమవుతున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా కొన్ని రోజులుగా రాష్ట్రంలోని సినిమా థియేటర్లపై ప్రభుత్వాధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారంటూ కొన్ని థియేటర్లను సీజ్ చేశారు. టికెట్ ధరలు తక్కువగా ఉండటం వల్ల థియేటర్ల నిర్వహణ కష్టమవుతోందని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు స్పష్టం చేస్తున్నారు. తీవ్రంగా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



