మంచు ట్విన్స్ కిడ్స్ ఫ్యాషన్ లైన్
on Jan 30, 2020
ఇప్పుడు ఫ్యాషన్స్ ను ఇష్టపడే పిల్లల తల్లులు ఆనందపడేలా, ఒక రెడీ మేడ్ కిడ్స్ ఫ్యాషన్ లైన్ ను లాంచ్ చెయ్యడానికి విరానికా మంచు రెడీ అవుతున్నారు. 2020 మే నెలలో ప్రారంభమయ్యే ఈ కిడ్స్ వేర్ లైన్ దేశవ్యాప్తంగా లభించనున్నది. మంచు ట్విన్స్ అమ్మానాన్నలు విరానికా మంచు, విష్ణు మంచు త్వరలోనే ఈ లైన్ బ్రాండ్ పేరును రివీల్ చేయనున్నారు.
ఇన్స్టాగ్రాంలో మంచు ట్విన్స్ ఆరియానా, వివియానా లకు 25 వేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ట్రెండీ క్లాతింగ్ ధరించిన ఫొటోలను రెగ్యులర్ గా ఆ కవలలు తమ ఇన్స్టాగ్రాం పేజీలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. వాటికి వేలాది లైక్స్ వస్తున్నాయి. వాళ్ల ఫాలోయర్స్ అంతకంతకూ పెరుగుతుండటం ఎ-లిస్టర్ డిజైనర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. తాము డిజైన్ చేసే కిడ్స్ లైన్లను మంచు ట్విన్స్ ద్వారా ఇన్ఫ్లూయెన్స్ చేయడానికి వారితో ఒప్పందం కుదుర్చుకోవాలని ఆ డిజైనర్లు ఆసక్తి చూపిస్తున్నారు.
సోషల్ ఇన్ఫ్లూయెన్సర్ల జాబితాలో మంచు ట్విన్స్ టాప్ లో ఉన్నారు. తమ పిల్లలు కూల్ గా, స్టైల్ గా కనిపించాలని ఆశించే పేరెంట్స్ వాళ్ల ఫాలోయర్స్ లిస్టులో ఉన్నారు. 'టోటల్లీ ఆసమ్' అనే ఇంటర్నేషనల్ చిల్డ్రెన్స్ డిజిటల్ మీడియా కంపెనీ నిర్వహించిన 'ఇండియన్ కిడ్స్ డిజిటల్ ఇన్సైట్స్ 2019' అనే ఒక అధ్యయనం ప్రకారం, డిజిటల్ కంటెంట్ ను ఉపయోగించే 73 శాతం మంది పిల్లలు తమకు ఫలానా వస్తువు కొనివ్వమని పేరెంట్స్ ను అడుగుతున్నారు. ఎందుకంటే, వాటిని చైల్డ్ ఇన్ఫ్లూయెన్సర్ వాడుతుండటం. అందుకు అనుగుణంగా చైల్డ్ ఇన్ఫ్లూయెన్సర్ ప్రచారకర్తగా ఉన్న వస్తువుల్ని 81 శాతమంది పేరెంట్స్ తమ పిల్లల కోసం కొంటున్నారు. చక్కని ఫ్యాషన్ తో ఉండే డ్రస్సుల్లో తమ పిల్లల్ని చూసుకొని మురిసిపోవాలని చాలామంది యంగ్ పేరెంట్స్ ఆ తరహా డ్రస్సుల కోసం ఎప్పుడూ అన్వేషిస్తూనే ఉంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని తమ ఫ్యాషన్ లైన్ బ్రాండును వినోదాత్మకంగా, సౌకర్యంగా, స్టైల్ గా, అదే సమయంలో అందుబాటు ధరల్లో ఉండేలా మంచు ట్విన్స్ రూపొందిస్తున్నారు. త్వరలో లాంచ్ కాబోతున్న ఈ బ్రాండుకు యూనివర్సల్ అప్పీల్ ఇవ్వడానికి న్యూయార్క్, యూరప్, భారత్ లోని పలువురు పేరుపొందిన డిజైనర్లతో విరానికా, మంచు దంపతులు ఒప్పందం కుదుర్చుకున్నారు.
తన మానసపుత్రిక అయిన ఈ కిడ్స్ లైన్ గురించి విరానికా మాట్లాడుతూ, "ఇది ఒక అద్భుతమైన అవకాశాన్నిచ్చే ఏర్పాటు. ఇది కేవలం ఒక బిజినెస్ కాదు, కిడ్స్ క్లాతింగ్ లైన్ లో తాజా ఊపిరి లాంటిది. సరైన ధరల పాయింట్లను, మన కలలకు తగ్గ ఉత్పాదక సామర్థ్యాలని క్రియేట్ చెయ్యడం గురించి కూడా మేం ఆలోచించాం. ఇది భారతదేశపు బెస్ట్ చిల్డ్రెన్ క్లాతింగ్ లైన్లలో ఒకటి అవుతుంది" అని చెప్పారు.