Home

»

Latest News

‘ఓ తండ్రిగా తట్టుకోలేకపోతున్నా..’ మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

Nov 2, 2026 11:29AM

అనంతపురం జిల్లా రాప్తాడులోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినులపై జరిగిన దాడి ఘటన తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా కలచివేస్తోంది. తరగతి గదిలోనే ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ రంపంతో విద్యార్థినిపై దాడి చేయగా, ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన మరో బాలిక కూడా గాయపడింది. ఈ దారుణ ఘటనపై ఇప్పటికే పలువురు ప్రముఖులు స్పందించారు. తాజాగా నటుడు మంచు మనోజ్ కూడా సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు.

ఓ తండ్రిగా ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని మనోజ్ పేర్కొన్నారు. బాధిత బాలికలిద్దరూ త్వరగా, పూర్తిగా కోలుకోవాలని, వారి కుటుంబాలకు మనోధైర్యం కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తన స్నేహితురాలిని కాపాడేందుకు ముందుకొచ్చిన బాలిక అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించిందని ప్రశంసించారు. ఆమెకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వాలని కోరారు.

బాలికలకు ప్రాణాలను కాపాడే చికిత్స అందిస్తున్న వైద్యులకు మనోజ్ కృతజ్ఞతలు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి, తరలింపు ప్రక్రియను సమన్వయం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసు, వైద్య బృందాలను అభినందించారు. బాధిత విద్యార్థుల కోసం 20 మంది మానసిక ఆరోగ్య కౌన్సెలర్లను నియమించడం సంతోషకరమని పేర్కొంటూ, ఈ ఘటనతో ప్రభావితమైన విద్యార్థులు, ఉపాధ్యాయులు, కుటుంబాలకు నిరంతర మానసిక సహకారం అందించాలని కోరారు.

మహిళలను వస్తువులుగా చూడటం, సరదా పేరుతోనైనా అగౌరవపరచడం ప్రమాదకరమైన ఆలోచనలకు దారితీస్తుందని మనోజ్ అభిప్రాయపడ్డారు. వేధింపులు, హింసకు పాల్పడేవారిపై కఠిన చర్యలు ఉండాలని, రోజువారీ జీవితంలో మహిళల పట్ల చూపించే అగౌరవాన్ని కూడా ప్రశ్నించాలని అన్నారు. మహిళలను గౌరవించడం ఇంటి నుంచే మొదలవుతుందని, పిల్లలు పెద్దల ప్రవర్తనను గమనిస్తుంటారని గుర్తుచేశారు. మనం కోరుకునే సురక్షితమైన సమాజం మన ఇళ్లలో మహిళలతో ఎలా వ్యవహరిస్తున్నామనే దాని నుంచే మొదలవుతుందని మంచు మనోజ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

 

 

[Manchu Manoj, Raptadu Incident, Manchu Manoj Emotional Post, Raptadu School Attack, Andhra Pradesh News, Women Safety, Manchu Manoj Instagram, Telugu Cinema News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com