మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్.. సంక్రాంతికి ఉతికి ఆరేస్తాడు!
on Jan 4, 2026

2026 సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలలో 'మన శంకర వరప్రసాద్ గారు' ఒకటి. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. నయనతార హీరోయిన్ కాగా, ప్రత్యేక పాత్రలో వెంకటేష్ అలరించనుండటం విశేషం. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ జనవరి 12న థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకొని సినిమాపై మంచి బజ్ ఏర్పడేలా చేశాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. (Mana Shankara Vara Prasad Garu Trailer)
సంక్రాంతి సీజన్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి ఎక్కువ ఆదరణ ఉంటుంది. పైగా అనిల్ రావిపూడికి సంక్రాంతి అనేది సెంటిమెంట్ గా మారింది. గతేడాది సంక్రాంతికి వస్తున్నాంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే 'మన శంకర వరప్రసాద్ గారు' ట్రైలర్ ఉంది. రెండున్నర నిమిషాల ఈ ట్రైలర్ ఫుల్ మీల్స్ కి హామీ ఇచ్చింది.
"ఇంటెలిజెన్స్ బ్యూరో, రా ఏజెంట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్.. ఎలాంటి క్రిమినల్ నైనా ఉతికి పిండి ఆరేస్తాడు" అంటూ పవర్ ఫుల్ గా వాయిస్ వస్తుండగా.. బట్టలు పిండుతూ, వంట చేస్తూ చిరంజీవి పాత్రను పరిచయం చేయడం సరదాగా ఉంది. ఇక వింటేజ్ మెగాస్టార్ అంటూ పవర్ ఫుల్ ఆఫీసర్ గా చిరంజీవిని చూపించారు. ఆ తర్వాత పవర్ ఫుల్ ఆఫీసర్, డైనమిక్ లేడీ కలిస్తే అంటూ.. చిరు, నయనతార మధ్య గిల్లికజ్జాలు చూపించిన తీరు మెప్పించింది.
ఇక చివరిలో హెలికాప్టర్ లో వెంకటేష్ ఎంట్రీ ఇవ్వడం అదిరిపోయింది. "చూడటానికి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావ్.. ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావ్ ఏంటి" అని చిరు అడగగా.. "మాస్ కే బాస్ లా ఉన్నావ్.. నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి" అని వెంకీ బదులివ్వడం భలే ఉంది.
మొత్తానికి అసలుసిసలైన పండగ సినిమా అనేలా 'మన శంకర వరప్రసాద్ గారు' ట్రైలర్ ఉంది. సినిమాలో ఏ మాత్రం ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అయినా బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమనిపిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



