మహేష్.. ఏమిటా స్పీడూ..??
on Aug 11, 2016
ఇది వరకు ఓ కథని పట్టెక్కించడానికి మీనమేశాలు లెక్కేసేవాడు మహేష్ బాబు. అందుకే అతని నుంచి రెండేళ్లకో సినిమా వచ్చేది. అయితే... క్రమంగా దూకుడు పెంచాడు. స్పీడు స్పీడుగా సినిమాలు చేస్తున్నాడు. ఓ సినిమా పట్టాలమీద ఉండగానే మరో సినిమా కోసం కూడా ఆలోచిస్తున్నాడు. అందుకే మహేష్ తో సినిమాలు తీద్దామనుకొంటున్న దర్శక నిర్మాతల లిస్టు రోజు రోజుకీ పెరిగిపోతోంది. మహేష్ కోసం కొరటాల శివ క్యూలో ఉన్నాడు. ఈ శ్రీమంతుడు కాంబినేషన్లో మరో సినిమా రావడం ఖాయమైంది. ఈలోగా వంశీ పైడిపల్లికి మహేష్ ఆఫర్ ఇచ్చేశాడు. 2017లో ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఓ పక్క పూరి మహేష్ కోసం తిరుగుతున్నాడు. పోకిరిలాంటి దిమ్మతిరిగే సబ్జెక్ట్ ఒకటి రెడీ చేసుకొన్నాడట. పూరితోనూ సినిమా చేస్తున్నట్టు మహేష్ ఎప్పుడో ప్రకటించేశాడు. ఇవన్నీ కాకుండా గౌతమ్ మీనన్, విక్రమ్ కె.కుమార్‌లాంటి వాళ్లు స్ర్కిప్టులు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఇక మహేష్ - రాజమౌళి కాంబినేషన్ ఎప్పటి నుంచో ఊరిస్తైనే ఉంది.
వీళ్లతో ఓ సినిమా చేయడానికి కె.ఎల్ నారాయణ రెడీగా ఉన్నారు. బాహుబలి 2 తరవాత రాజమౌళి తీసే సినిమా మహేష్ తోనే అని టాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా రెడీ అయ్యాడట. ఖలేజా తరవాత మహేష్ తో ఓ సినిమా చేద్దామని తెగ ఉబలాటపడుతున్నాడు త్రివిక్రమ్. ఆయనకీ ప్రిన్స్ పచ్చజెండా ఊపేసినట్టే. ఇక్కడికే 7గురు దర్శకులయ్యారు. వీళ్లతో సినిమాలెప్పుడు తీస్తాడు?? ఎంత ఫాస్టుగా చేసినా మరో ఐదేళ్ల వరకూ వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు. మహేష్ స్పీడు చూస్తుంటే ముచ్చటగానే ఉంది. అయితే వచ్చిన ప్రతీ సినిమాకీ తలాడించేసి లిస్టు పెంచుకొంటూ పోతే, మహేష్ ఏ సినిమా చేస్తున్నాడు, ఎవరితో చేస్తాడు? ఎప్పుడు చేస్తాడు? అనే కన్‌ఫ్యూజన్లు రోజు రోజుకీ పెరిగిపోతుంటాయి. అది మాత్రం డేంజరే.