ENGLISH | TELUGU  

'మ‌హాస‌ముద్రం' మూవీ రివ్యూ

on Oct 14, 2021

 

సినిమా పేరు: మ‌హాస‌ముద్రం
తారాగ‌ణం: శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్‌, అదితి రావ్ హైద‌రి, అను ఇమ్మానుయేల్‌, శ‌ర‌ణ్య‌, జ‌గ‌ప‌తిబాబు, రావు ర‌మేశ్‌, రామ‌చంద్ర‌రాజు, గోప‌రాజు ర‌మ‌ణ‌, వైవా హ‌ర్ష‌
మ్యూజిక్‌: చైత‌న్ భ‌ర‌ద్వాజ్‌
సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌
ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ కె.ఎల్‌.
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: అవినాశ్ కొల్లా
నిర్మాత‌: సుంక‌ర రామ‌బ్ర‌హ్మం
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: అజ‌య్ భూప‌తి
బ్యాన‌ర్‌: ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
విడుద‌ల తేదీ: 14 అక్టోబ‌ర్ 2021

'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజ‌య్ భూప‌తి డైరెక్ట్ చేస్తున్న రెండో సినిమా.. శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ క‌లిసి న‌టిస్తోన్న సినిమా అనేస‌రికి 'మ‌హాస‌ముద్రం'పై సినీ ప్రియుల్లో క్రేజ్ వ‌చ్చింద‌నేది నిజం. పాట‌లు, ట్రైల‌ర్ సినిమాపై ఆస‌క్తిని రెట్టింపు చేశాయి. విడుద‌ల‌య్యే స‌మయానికి 'మ‌హాస‌ముద్రం'పై చాలా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి.. మ‌న ముందుకు వ‌చ్చిన ఆ సినిమా అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే ఉందా...

క‌థ‌
విశాఖ‌ప‌ట్నంలో అర్జున్ (శ‌ర్వానంద్‌), విజ‌య్ (సిద్ధార్థ్‌) బెస్ట్ ఫ్రెండ్స్‌. ఏదో చిన్న బిజినెస్ చేసుకొని బ‌తికేద్దామ‌నుకొనే యువ‌కుడు అర్జున్ అయితే, ఎస్సై అయ్యి, లంచాలు తీసుకొని బాగా సంపాదించుకోవాల‌నే మ‌న‌స్త‌త్వం ఉన్న‌వాడు విజ‌య్‌. డాన్స్ టీచ‌ర్ అయిన మ‌హాల‌క్ష్మి అలియాస్ మ‌హా (అదితి రావ్ హైద‌రి), విజ‌య్ ప్రేమించుకుంటారు. లా స్టూడెంట్ స్మిత (అను ఇమ్మానుయేల్‌)కు ద‌గ్గ‌ర‌వుతాడు అర్జున్‌. స‌ముద్రం ఆధారంగా చీక‌టి సామ్రాజ్యాన్ని న‌డిపే ధ‌నుంజ‌య్ (రామ‌చంద్ర‌రాజు)తో అనూహ్య ప‌రిస్థితుల్లో విజ‌య్ త‌ల‌ప‌డాల్సి వ‌చ్చిన‌ప్పుడు ధ‌నుంజ‌య్ తీవ్రంగా గాయ‌ప‌డ‌తాడు. బ‌తికి ఉండాలంటే అక్క‌డ్నుంచి దూరంగా పోవ‌డ‌మే బెట‌ర‌ని అర్జున్‌, అత‌ని స‌న్నిహితుడు చుంచుమామ (జ‌గ‌ప‌తిబాబు) స‌ల‌హా చెప్ప‌డంతో వెళ్లిపోతాడు విజ‌య్‌. ఆ త‌ర్వాత వారి జీవితాలు ఎలా మారాయి?  విజ‌య్‌నే న‌మ్ముకున్న మ‌హా ప‌రిస్థితి ఏమ‌య్యింది?  త‌మ‌ను టార్గెట్ చేసిన ధ‌నుంజ‌య్‌, అత‌ని అన్న బాబ్జీ (రావు ర‌మేశ్‌)ల‌ను అర్జున్‌, విజ‌య్ ఎలా ఎదుర్కొన్నారు? వంటి ప్ర‌శ్న‌ల‌కు సెకండాఫ్‌లో స‌మాధానాలు ల‌భిస్తాయి.

విశ్లేష‌ణ‌
అజ‌య్ భూప‌తిపై చాలా ఎక్కువ ఆశ‌లు పెట్టుకున్న‌వాళ్లు, 'ఆర్ఎక్స్ 100' మూవీ త‌ర్వాత అత‌ని అభిమానులైన‌వాళ్లూ తీవ్రంగా నిరాశ‌చెందే సినిమా 'మ‌హాస‌ముద్రం'. 2017 నుంచి 2021 వ‌ర‌కు వైజాగ్‌లో జ‌రిగే క‌థ‌గా ఈ సినిమాని మ‌న ముందుకు తెచ్చాడు భూప‌తి. ఆ క‌థ కానీ, క‌థ‌నం కానీ ఏమాత్రం ఆక‌ట్టుకొనేలా లేవు. క్యారెక్ట‌రైజేష‌న్స్ విష‌యంలో ఏమాత్రం మెచ్యూరిటీ క‌నిపించ‌లేదు. ఇద్ద‌రు హీరోల్లో శ‌ర్వానంద్‌కు ఎక్కువ నిడివి ఉన్న క్యారెక్ట‌ర్ ల‌భించింది. ఫ్రెండ్ కోసం ఏం చేయ‌డానికైనా సిద్ధ‌ప‌డే ఆ పాత్ర‌ను కూడా ఆక‌ట్టుకొనేలా మ‌ల‌చ‌డంలో డైరెక్ట‌ర్ ఫెయిల‌య్యాడు. అందుకే ఆ పాత్ర‌తో మ‌నం స‌హానుభూతి చెందలేం, ప్ర‌యాణం చెయ్య‌లేం. ప్ర‌ధాన పాత్రే ఆ స్థితికి గురైన‌ప్పుడు మిగ‌తా క్యారెక్ట‌ర్స్ గురించి చెప్పేదేముంది?  సినిమాలో ఏ మెయిన్ క్యారెక్ట‌ర్‌తోనూ మ‌నం ఐడెంటిఫై కాలేం. సినిమాను బాగా దెబ్బ‌తీసిన అంశం ఇదే. 

'మ‌హాస‌ముద్రం' ఇద్ద‌రు స్నేహితుల క‌థే అయినా, ఆ క‌థ‌కు కేంద్ర‌బిందువుగా నిలిచేది మ‌హా పాత్ర‌. ఆ పాత్ర‌ను తీర్చిదిద్దిన విధానంతోనూ డైరెక్ట‌ర్ డిజ‌ప్పాయింట్ చేశాడు. విజ‌య్‌ను ప్రేమించిన మ‌హా, అత‌డు క‌నిపిస్తే చాలు ముందు అత‌డి చేతిలో డ‌బ్బు పెట్టి, ఆ త‌ర్వాత ప్రేమ‌ను కురిపించ‌డం ఆ పాత్ర ఔచిత్యాన్ని దెబ్బ తీసింది. నిజానికి మ‌న సానుభూతికి నోచుకోవాల్సిన ఆ పాత్ర‌ను అలా కాకుండా చేసింది, ఆ పాత్ర‌కు ఇచ్చిన ట్రీట్‌మెంట్‌. 

'మ‌హాస‌ముద్రం' అనే టైటిల్ సినిమాకు ఎందుకు పెట్టిన‌ట్లు?  స‌ముద్రం నేప‌థ్యంలో సాగే క‌థ కాబ‌ట్టి, హీరోయిన్ పేరు మ‌హా కాబ‌ట్టి ఆ టైటిల్ పెట్టాడేమోన‌ని చాలామంది అనుకోవ‌చ్చు. కానీ అత‌డి ఉద్దేశం వేరు. ఇక్క‌డ స‌ముద్రం అనే మాట‌ను శ‌ర్వానంద్ చేసిన అర్జున్ క్యారెక్ట‌ర్‌కు ఆపాదించాడు. "నువ్వు స‌ముద్రం లాంటివి అర్జున్‌. అన్ని న‌దులూ నీలో క‌ల‌వ‌డానికి ఆశ‌ప‌డుతుంటాయి" అని ఓ సంద‌ర్భంలో స్మిత చేత అనిపించాడు భూప‌తి. సో.. టైటిల్ వెనుక క‌థ ఇదే. ఈ క‌థ‌లో బాగా అన్యాయానికి గురైంది స్మిత పాత్ర‌.

వైజాగ్ ద‌గ్గ‌ర బంగాళాఖాతంలో గంజాయి, న‌ల్ల‌మందు స్మ‌గ్లింగ్ ఎలా జ‌రుగుతుంటుందో ఈ సినిమాలో మ‌నం చూడ‌వ‌చ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో వ‌చ్చిన 'నార్కోస్' సిరీస్‌లో డ్ర‌గ్స్‌ను ఎలాంటి మార్గాల ద్వారా స్మ‌గ్లింగ్ చేస్తుంటారో, స్మ‌గ్లింగ్ డెన్‌లు ఎలా ఉంటాయో చాలామంది చూసుంటారు. ఇందులో ఆ త‌ర‌హా సీన్లు కొన్ని క‌నిపిస్తాయి. ఇంట‌ర్వెల్ పాయింట్‌, క్లైమాక్స్ కూడా వీక్‌గానే ఉండ‌టం 'మ‌హాస‌ముద్రం' స్పెషాలిటీ!

సినిమా మొత్తంలో ఒక సీను న‌చ్చింది.. మ‌హాకు చ‌డీచ‌ప్పుడు కాకుండా అబార్ష‌న్ చేయించ‌మ‌ని చుంచు మామ అంటే "ఆమాట చెప్ప‌డానికి నువ్వెవ‌డివిరా?" అని లాగి చెంప‌మీద కొడుతుంది అర్జున్ వాళ్ల‌మ్మ (శ‌ర‌ణ్య‌). ఇక్క‌డ ఆమె క్యారెక్ట‌ర్ నిల‌బ‌డింది. చెప్పుకోద‌గ్గ విష‌యం ఇంకోటుంది. ఈ సినిమాలో ప్ర‌కాశ్‌రాజ్ క‌నిపించాడు. శ‌ర్వానంద్ తండ్రిగా.. గోడ‌పై దండ‌వేసిన ఫొటోగా!

టెక్నిక‌ల్‌గా కూడా ఈ సినిమా నిరాశ‌ప‌రిచింది. సంభాష‌ణ‌లు సాధారణంగా న‌డిచాయి. ఎమోష‌న‌ల్ సీన్స్‌లో సంభాష‌ణ‌లు చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. గుండెల్లో దూసుకెళ్లే మాట‌లు లేక‌పోవ‌డంతో ఎమోష‌న‌ల్ సీన్స్ కూడా పేల‌వంగా అనిపిస్తాయి. ఆ సీన్స్‌ను అజ‌య్ భూప‌తి తీసిన విధానం ఏమాత్రం ఆక‌ట్టుకొనేలా లేవు. ఉన్నంత‌లో ఆక‌ట్టుకున్న‌ది.. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ మ్యూజిక్‌. మాస్ బీట్స్‌తో సాగే "హే రంభ" సాంగ్‌, మెలోడియ‌స్ ట్యూన్స్‌తో న‌డిచే "చెప్ప‌కే చెప్ప‌కే" పాట‌లు అల‌రించాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. రాజ్ తోట సినిమాటోగ్ర‌ఫీలో మెరుపులు క‌నిపించ‌లేదు. మామూలుగా ఉంది. ఇలాంటి ట్మీట్‌మెంట్ ఉన్న సీన్ల‌ను ఎటిట‌ర్ ప్ర‌వీణ్ మాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఏం అతికిస్తాడు?! ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్ కూడా సాధార‌ణ స్థాయిలోనే ఉంది. నిర్మాణ విలువ‌లు జ‌స్ట్ ఓకే.

న‌టీన‌టుల ప‌నితీరు
అర్జున్, విజ‌య్ పాత్ర‌ల్లో శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్‌ల‌ను చూశాక‌.. ఇది రాంగ్ క్యాస్టింగ్ మూవీ అనిపించ‌క మాన‌దు. అర్జున్ క్యారెక్ట‌ర్‌కు న్యాయం చెయ్య‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డాడు శ‌ర్వా. కానీ యాక్ష‌న్‌, ఎమోష‌న్స్ మేళ‌వించిన ఆ క్యారెక్ట‌ర్‌కు అత‌ని బాడీ లాంగ్వేజ్ సూట‌వ‌లేదు. ఫేసియ‌ల్ ఎక్స్‌ప్రెష‌న్స్ విష‌యంలో స‌క్సెస్ అయిన అత‌ను, యాక్ష‌న్ సీన్స్‌, చేజింగ్ సీన్స్‌లో ఆక‌ట్టుకోలేదు. అలాగే విజ‌య్ పాత్ర సిద్ధార్థ్ చెయ్యాల్సిన క్యారెక్ట‌ర్ కాదు. అతనికి ఆ పాత్ర న‌ప్ప‌లేదు. మ‌హా పాత్ర‌లో అదితిరావ్ హైద‌రి మాత్రం రాణించింది. డైరెక్ట‌ర్ గ‌నుక ఆమె పాత్ర మీద మ‌రింత శ్ర‌ద్ధ పెట్టిన‌ట్ల‌యితే, ఆమె మ‌రింత‌గా ఆ పాత్ర‌లో ఆక‌ట్టుకుని ఉండేది. ఒక స‌హాయ‌పాత్ర లాగా వ‌చ్చిపోయే స్మిత క్యారెక్ట‌ర్‌కు అను ఇమ్మానుయేల్ కూడా స‌రిపోయింది. 

అర్జున్ త‌ల్లి పాత్ర‌లో శ‌రణ్య రాణించారు. చుంచుమామ‌గా ఇటీవ‌లి కాలంలో ఎన్న‌డూ చేయ‌ని త‌ర‌హా పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు ఆక‌ట్టుకున్నారు. త‌ను ఏ త‌ర‌హా పాత్ర‌లోనైనా రాణించ‌గ‌ల‌న‌ని ఈ సినిమాతో ఆయ‌న నిరూపించుకున్నారు. గూని బాబ్జీ పాత్ర‌ను త‌న‌దైన శైలిలో దున్నేశారు రావు ర‌మేశ్‌. ఆయ‌న న‌ట‌న‌, ఆయ‌న డైలాగ్ డిక్ష‌న్ ఆక‌ట్టుకున్నాయి. ధ‌నుంజ‌య‌గా రామ‌చంద్ర‌రాజు (కేజీఎఫ్ గ‌రుడ‌) మెప్పించాడు. మ‌హా తాగుబోతు తండ్రి పాత్ర‌కు గోప‌రాజు ర‌మ‌ణ న్యాయం చేశారు. మహా కూతురిగా న‌టించిన చిన్నారి.. ముద్దు ముద్దుగా ఉంది. న‌వ్వించ‌డానికి వైవా హ‌ర్ష‌కు ఎక్కువ స్కోప్ దొర‌క‌లేదు.

తెలుగువ‌న్ ప‌ర్‌స్పెక్టివ్‌
ఏమాత్రం ఆక‌ట్టుకోని బ్యాడ్ స్క్రీన్‌ప్లేతో, బ్యాడ్ క్యారెక్ట‌రైజేష‌న్స్‌తో రెండున్న‌ర గంట‌ల‌కు పైగా న‌డిచే ఈ మూవీని చివ‌రి దాకా చూడాలంటే కాస్తంత స‌హ‌నం కావాల్సిందే. 2021లో ఇప్ప‌టివ‌ర‌కూ థియేట‌ర్ల‌లో రిలీజైన క్రేజీ సినిమాల్లో బాగా డిజ‌ప్పాయింట్ చేసిన సినిమా 'మ‌హాస‌ముద్రం'. ఓర్పు ఎక్కువ ఉన్న‌వాళ్లు దీన్ని చూసేందుకు ధైర్యం చేయ‌వ‌చ్చు.

రేటింగ్‌: 2/5

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.