
మధుబాల.. క్షీరసాగర మధనం జరిగినప్పుడు అమృతంతో పాటు అందం కూడా పుట్టిందేమో అనేంత అందం ఆమె సొంతం. ఆ అందానికి అద్భుతమైన నటనని కూడా జోడించి 1950 వ దశకంలో భారతీయ చిత్ర పరిశ్రమని, అభిమానులని, ప్రేక్షకులని తన కనుసన్నల్లో ఉంచుకుంది. అంతటి గొప్ప నటీమణి కేవలం 36 ఏళ్ల చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధితో చనిపోయారు.
కూతురి మరణాన్ని తట్టుకోలేకపోయిన ఆమె తండ్రి అతావుల్లా ఖాన్ తీవ్రమైన మానసిక వేదనని అనుభవించారు. మధుబాల ఖననం చేసిన రోజున ఆమె భౌతిక కాయంపై, సమాధిలోనూ విపరీతంగా అత్తరు పోయించారట. ఎంతలా అంటే ఆ సువాసనలు ఆ శ్మశాన వాటికలో నెలల తరబడి నిలిచిపోయాయని ఆమె సోదరి మధుర భూషణ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో భావోద్వేగంతో పంచుకున్నారు. ముమ్మరమైన అనారోగ్య సమస్యలు, మూడు గుండెపోట్లు, బ్రెయిన్ స్ట్రోక్ బాధితుడైనప్పటికీ అతావుల్లా ఖాన్ క్రమం తప్పకుండా కూతురి సమాధి వద్దకు వెళ్లి కుర్చీ వేసుకొని గంటల తరబడి ఏడ్చేవారట. ముస్లిం ఆచారాల ప్రకారం మధ్య భాగం తెరిచి ఉంచాల్సి ఉన్నప్పటికీ, కూతురిపై ఉన్న అపారమైన ప్రేమతో ఆయన ఆ సమాధిని పూర్తిగా పాలరాతి (మార్బుల్) కట్టడంగా తీర్చిదిద్దారు. అయితే కాలక్రమేణా అతావుల్లా ఖాన్ కన్నుమూసిన తర్వాత ఆ పాలరాతి నిర్మాణం చుట్టూ వివాదాలు చెలరేగాయి. ముంబైలోని జుహు ముస్లిం కబరిస్థాన్‌లో స్థల కొరత తీవ్రంగా ఉండటం, కొత్త ఖననాల కోసం జాగా సర్దుబాటు చేయాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ఆ పాలరాతి సమాధి నిర్మాణాన్ని ధ్వంసం చేసి సుమారు 3 అడుగుల మేర మట్టి పోసి చదువు చేశారు. తమ ఆచారాల ప్రకారం సెలబ్రిటీలైనా సాధారణ వ్యక్తయినా సమాధుల విషయంలో ప్రత్యేక మినహాయింపులు ఉండవని, స్థలాల కొరత కారణంగా పాత సమాధులపై మళ్లీ ఖననం చేయాల్సి వస్తుందని ట్రస్ట్ నిర్వాహకులు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: కల్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే!

ఈ ఘటనతో మధుబాల జాడ కోల్పోయామని, ఆమె సమాధి పూర్తిగా కనుమరుగైందని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఎవరో చెప్పగా అక్కడికి వెళ్లి చూస్తే కేవలం 'మధుబాల' అనే పేరుతో చిన్న గుర్తు మాత్రమే మిగిలిందని ఆమె సోదరి తెలిపారు. అదే శ్మశాన వాటికలో కేవలం 5 నుంచి 10 మీటర్ల దూరంలోనే దిలీప్ కుమార్, పర్వీన్ బాబీ, మహమ్మద్ రఫీ, నౌషాద్ వంటి దిగ్గజాల సమాధులు కూడా ఉండటం గమనార్హం. ఒక వెండితెర మహారాణి తుది విశ్రాంతి స్థలం ఇలా కనుమరుగైపోవడం సినీ చరిత్రలో అత్యంత విషాదకరమైన అధ్యాయంగా మిగిలిపోయింది. ఆ అందం విశ్వం నుంచి దూరమైంది 1969 ఫిబ్రవరి 23
[Madhubala Grave Mystery Mumbai, Madhubala grave, Madhubala marble tomb, Juhu Muslim cemetery, Mumtaz Jehan Begum Dehlavi, Tollywood Cinema News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News]





