‘లూసిఫర్2’ వివాదంపై గళమెత్తిన సురేష్‌గోపి.. దద్దరిల్లిన పార్లమెంట్!
on Apr 4, 2025
మోహన్‌లాల్ హీరోగా పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో 2019లో రూపొందించిన ‘లూసిఫర్’ సంచలన విజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘లూసిఫర్2: ఎంపురాన్’ చిత్రాన్ని రూపొందించారు. మార్చి 27న ఈ చిత్రాన్ని పలు భాషల్లో విడుదల చేశారు. సినిమాలో కొన్ని అభ్యంతరకరమైన సీన్స్ ఉన్నాయనే వివాదం చెలరేగడంతో వాటిని తొలగించాలని సెన్సార్ బోర్డ్ చెప్పడంతో ఆ సీన్స్ తొలగించి ట్రిమ్డ్ వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు. అయినప్పటికీ సినిమాపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఈ సినిమా విషయం పార్లమెంట్ వరకు వెళ్లింది. రాజ్యసభలోని కొందరు సభ్యులు ఎంపురాన్ సినిమాకి సంబంధించిన వివాదాన్ని మరోసారి లేవనెత్తారు. దీనిపై స్పందిస్తూ మలయాళ నటుడు, కేంద్రమంత్రి, బీజేపీ ఎం.పి. సురేష్‌గోపి తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు అధికార పక్షానికి చెందిన ఎంపీలు ఆయనకు మద్దతుగా నిలిచారు. అయితే విపక్ష సభ్యులు మాత్రం సురేష్‌గోపి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
దాదాపు 5 నిమిషాల పాటు సురేష్‌గోపీ ఆగ్రహంతో మాట్లాడారు. ప్రముఖ రాజకీయ నేత టీపీ చంద్రశేఖరన్ జీవితం, హత్య నేపథ్యంలో రూపొందిన ‘టీపీ51’ చిత్రాన్ని కట్స్‌తో రీరిలీజ్ చేసే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. ఆ సినిమాతోపాటు ‘లెఫ్ట్ రైట్ లెఫ్ట్’ సినిమాని కూడా ధైర్యం ఉంటే రిలీజ్ చెయ్యాలని కేరళ సీఎంకి సవాల్ విసిరారు. ఆ రెండు సినిమాలను రిలీజ్ చేయాలంటే గట్స్ కావాలన్నారు. సభలో సురేష్ గోపి మాట్లాడిన తీరుపై కొంతమంది సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తను మాట్లాడుతున్న భాషలో ఎలాంటి తప్పు లేదని స్పీకర్‌కు తెలియజేశారు సురేష్ గోపి. ఎంపురాన్ చిత్ర నిర్మాతలపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. ఈ వివాదం తన దృష్టికి వచ్చిన వెంటనే నిర్మాతలకు ఫోన్ చేశానని అన్నారు. అలాగే సినిమా ప్రారంభంలో తన పేరుతో వేసిన కార్డును తొలగించాలని కూడా వారికి సూచించానన్నారు. సభలో తప్పుగా మాట్లాడానని భావిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమేనన్నారు. ఈ సినిమాను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు, తన పార్టీపై చెడు ప్రచారం చేస్తున్నారన్నారు. పార్లమెంట్‌లో సురేష్‌గోపీ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
