సూపర్ స్టార్ కృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు
on May 31, 2012
సూపర్ స్టార్ కృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు సినీ పరిశ్రమలో సాంకేతికంగా చాలా మార్పులకు కారణమైన హీరో, డేరింగ్ అండ్ డాషింగ్ అన్న మాటకు నిర్వచనం చెప్పిన హీరో ఘట్టమనేని శివరామకృష్ణ అంటే సూపర్ స్టార్ కృష్ణ. గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా, బుర్రిపాలెం గ్రామంలో, వీరరాఘవయ్య, నాగరత్నమ్మ దంపతులకు 1943 వ సంవత్సరం, 'మే' 31 వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ జన్మించారు. బి.యస్.సి. వరకూ చదువుకున్నారు కృష్ణ.
చదువుకునే రోజుల్లోనే నటన మీద మక్కువతో అనేక నాటకాలాడారు కృష్ణ. అనతరం 1965 లో"తెనె మనసులు" చిత్రం ద్వారా తొలిసారి హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగు వెండితెర మీద సూపర్ స్టార్ ప్రభంజనం మొదలయ్యింది. మామూలుగా కృష్ణ గారికి ధైర్యం చాలా ఎక్కువ. ఎవరూ ఊహించటానికి కూడా సాహసించని రోజుల్లో ఆయన "జెమ్స్ బాండ్" తరహా "గూఢచారి 116" వంటి గూఢచారి చిత్రాలకు శ్రీకారం చుట్టారు. అలాగే మనకు అసలు పరిచయం లేని "మోసగాళ్ళకు మోసగాడు" వంటి కౌబాయ్ చిత్రాలకు కూడా కృష్ణ గారే ఆద్యుడు. ఇక తొలి సినిమా స్కోప్ " అల్లూరి సీతారామరాజు" చిత్రాన్ని కూడా ఆయనే హీరోగా నటిస్తూ నిర్మించారు. "సింహాసనం' చిత్రంతో 70 m m ని కూడా ఆయనే తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశపెట్టారు.
ఒక టైంలో ఆయన సినిమాలు సంవత్సరానికి 17 విడుదలైతే వాటిలో 9 వందరోజులాడాయి...! ఇక విశ్వవిఖ్యాతనటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ, డాక్టర్ నందమూరి తారకరామారావుగారితో ఢీ అంటే ఢీ అంటూ ఆయన "దానవీరశూరకర్ణ" చిత్రానికి పోటీగా "కురుక్షేత్రం" చిత్రాన్ని నిర్మించి విడుదల చేశారు. రామారావు గారి తెలుగు దేశం పార్టీకి వ్యతిరేకంగా కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆయనకు వ్యతిరేకంగా "మండలాధీశుడు" అనే చిత్రాన్ని నిర్మించి రామారావు గారిని దారుణంగా విమర్శించారు.
నిజానికి అప్పట్లో రామారావుగారిని ఎదుర్కోవటమంటే సామాన్యమైన విషయం కాదు. అయినా ఎదుర్కొన్నారు. కృష్ణ గారి గుండెధైర్యం అలాంటిది. ఇక నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన కళాఖండం "దేవదాసు" చిత్రాన్ని తాను హీరోగా నటిస్తూ, తన భార్య విజయనిర్మల దర్శకత్వంలో మళ్ళీ నిర్మించారు. తన మనసులో ఉన్న విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పగలిగిన వ్యక్తి తెలుగు సినీ పరిశ్రమలో చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ కృష్ణ తొలి స్థానంలో ఉంటారు.
తన సినిమానే కాదు ఎవరి సినిమా అయినా చూడగానే ఆయన జడ్జిమెంట్ అద్భుతంగా ఉంటుంది. ఆయన ఇది సూపర్ హిట్ అంటే సూపర్ హిట్టే...ఆయన ఫ్లాపంటే ఫ్లాపే. దీనికి ఉదాహరణగా కృష్ణ గారు "పోకిరి" సినిమా చూసి "ఇది 40 కోట్లు వసూలు చేస్తుంది. బ్లాక్ బస్టర్ హిట్టవుతుంది" అని దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో ప్రిన్స్ మహేష్ బాబుతో అన్నారట. ఆ మాటలు విన్న వాళ్ళిద్దరూ నవ్వుకున్నారట. కాని కృష్ణ గారు చెప్పిన మాటలు నిజమైన తర్వాత వాళ్ళిద్దరూ కృష్ణ గారి దగ్గరకు వెళ్ళి క్షమాపణలు కోరారట.
350 కి పైగా చలన చిత్రాల్లో నటించిన ఆయన 12 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తర్వాత తను సొంతంగా బ్యానర్ స్థాపించి అనేక చిత్రాలను నిర్మించారు. ఇలా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు అనితరసాథ్యం. అటువంటి కృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఆ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలనివ్వాలని కోరుకుంటూ తెలుగువన్ ఆయన సమర్పిస్తున్న చిన్న జ్ఞాపిక ఈ వ్యాసం.