కార్తికేయ 'చావు కబురు చల్లగా' షూటింగ్ షురూ
on Feb 13, 2020
'ఆర్ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ.. గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై 'చావు కబురు చల్లగా' అనే సినిమా చేయనున్నట్లు ఇదివరకే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చిన సంగతి మనకు తెలుసు. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీ గురువారం లాంఛనంగా మొదలైంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కార్తికేయ జోడీగా లావణ్యా త్రిపాఠీ నటిస్తోన్న ఈ సినిమా ముహూర్తపు షాట్‌కు అల్లు అరవింద్ మనవరాలు బేబీ అన్విత క్లాప్ నివ్వగా, అల్లు అర్జున్ తనయుడు అయాన్ కెమెరా స్విచ్చాన్ చేశాడు. అల్లు అరవింద్ గౌరవ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 19న ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తోంది.
ఈ మూవీలో బస్తీ బాలరాజు అనే క్యారెక్టర్‌లో కార్తికేయ చేస్తున్నాడు. పోస్టర్‌లో చనిపోయినవారిని శ్మశానికి తీసుకుపోయే 'స్వర్గపురి వాహనం'పై నిల్చొని, లుంగీ పైకికట్టి స్టైల్‌గా సిగరెట్ తాగుతున్న కార్తికేయ లుక్ ఆకర్షణీయంగా ఉంది. కాగా గీతా ఆర్ట్స్ వంటి సుప్రసిద్ధ సంస్థలో పనిచేసే అవకాశం రావడంతో క్లౌడ్ 9 మీదున్నాడు కార్తికేయ. "గీతా ఆర్ట్స్ బ్యానర్ పోస్టర్‌లో నేను. ఇది నిజంగానే జరుగుతోందా? కౌషిక్.. నువ్వు నాకిస్తున్న దానికి 'థాంక్ యు' అనేది చాలా చిన్న పదం. ఈ క్రేజీ 'బస్తీ బాలరాజు' పాత్రను చేయడం గర్వంగా ఫీలవుతున్నా. మీరు అతని ప్రేమలో పడకతప్పదు. 'చావు కబురు చల్లగా'కు మీ ప్రేమ ఎప్పుడూ కోరుకుంటుంది" అని అతను ట్వీట్ చేశాడు.
ఆమని, శ్రీకాంత్ అయ్యంగార్, మహేష్, భద్రం ఇతర పాత్రధారులైన ఈ మూవీకి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా, సునీల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.