‘కన్నాగి’ మూవీ రివ్యూ
on Feb 9, 2024
మూవీ : కన్నాగి
నటీనటులు : కీర్తి పాండియన్, అమ్ము అభిరామి, విద్య ప్రదీప్, షాలిన్ జోయ
సినిమాటోగ్రఫీ : రామ్ జీ
ఎడిటింగ్: కె శరత్ కుమార్
మ్యూజిక్: షాన్ రహమాన్
నిర్మాతలు : ఎమ్ గణేష్, జె ధనుష్
రచన, దర్శకత్వం: యశ్వంత్ కిషోర్
ఓటీటీ : ప్రైమ్ వీడియో
కొన్ని సినిమాలు ఇతర భాషలలో కంటే తెలుగులో బాగా హిట్ అవుతాయి. తమిళంలో విడుదలైన సినిమా 'కన్నాగి'.. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా కథేంటో ఓసారి చూసేద్దాం...
కథ:
తమిళనాడులోని ఓ ప్రాంతంలో కళై అనే అమ్మాయి తన అమ్మనాన్నలతో ఉంటుంది. కళై వాళ్ళ అమ్మ సరళ.. తన కూతురికి గొప్పింటి సంబంధాన్ని చేయాలని అనుకుంటుంది. కళై నాన్న మయిళసామి తన కూతురు బాగుంటే చాలని అనుకునే సాధారణ వ్యక్తి. దీంతో తనకి ఏ పెళ్ళిచూపులు ఏర్పాటు చేసిన సక్సెస్ అవ్వవు. మరోచోట ఓ అమ్మాయి గీత.. తన భర్త విడాకులకి అప్లై చేశాడని తనని బలవంతం చేశారని , ఆ విడాకులు తనకి ఇష్టం లేవని లాయర్ ని కలుస్తుంది. ఇలాగే వేరే ప్రాంతంలో ఓ అమ్మాయి నదిగా చాలా మెచ్చుర్డ్ గా ఆలోచిస్తూ తనని చేసుకునే అబ్బాయి చాలా టాలెంటెడ్ అవ్వాలని అనుకుంటుంది. మరోచోట ఇంకో అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. అయితే తను రిలేషన్ షిప్ లో ఉంటుంది. ఆమె భర్త సినిమాలలో రైటర్ గా ప్రయత్నిస్తుంటాడు. దాంతో ఆ ప్రెగ్నెన్సీ తీయించాలని భావిస్తాడు. ఇలా నలుగురు విభిన్న కథలు సాగుతుంటాయి. అయితే కళైకి పెళ్ళి జరిగిందా? ఆ అమ్మాయికి కోర్టు విడాకులు ఇచ్చిందా? మరో అమ్మాయికి అబార్షన్ జరిగిందా? మెచుర్ట్ గా ఉండే అమ్మాయి లవర్ ఏం చేశాడు.. ఇలాంటి నాలుగు భిన్నమైన కథలని ఎలా లింక్ చేశారనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే...
విశ్లేషణ:
నలుగురి జీవితాలు.. వారి బాధలు, కష్టాలు వాటి నుండి వాళ్ళు ఎలా బయటపడ్డారంటు కథ కాస్త ఆసక్తికరంగా మొదలైన చివరి వరకు స్లోగా సాగుతుంది. కన్నాగి అంటే కామా.. మనం ఏదైనా రాసేటప్పుడు ఇంకా ఉంది అని చెప్పడానికి కామాని వాడతాం.. దాన్నే వివరిస్తూ సినిమాలోని ప్రతీ ఒక్కరి జీవితానికి సింక్ చేశారు దర్శకుడు యశ్వంత్ కిషోర్.
కథ మొదట ఒక ఊరిలో మొదలైన ఆ తర్వాత సిటీకి.. అలా వెళ్తూ ఉంటుంది. కథలోని ప్రతీ పాత్ర ఎందుకు అలా ఉంటుందో.. అసలెవర్రా మీరంతా అనేంతలా ఉంటుంది. అయితే సినిమా క్లైమాక్స్ లో రివీల్ అయ్యే ట్విస్ట్ తో ఓ అంచనాకి వచ్చేస్తాం. అయితే ఈ క్లైమాక్స్ కోసం సినిమాని గందరగోళంగా చూపించడం అంతా ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టినట్టుగా ఉంటుంది. అడల్ట్ సీన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆపరేషన్ తర్వాత చూపించే ఆ సీన్ ని ఆడవాళ్ళు చూడకపోవడమే బెటర్. సినిమా నిడివి అంత అవసరం లేదనిపిస్తుంది. నలుగురి ఆడవాళ్ళ లైఫ్ ని బాగానే చూపించిన చివరికి వారి పాత్రలని లింక్ చేసే సీన్ అంతా కన్విన్సింగ్ గా ఉండదు. ఈ సినిమా చూస్తే మనం కాజల్, రెజీనా కసండ్ర, ప్రియదర్శి నటించిన ' అ ' సినిమానే గుర్తుకొస్తుంది. ఈ సినిమాని అర్థం చేసుకోవాలంటే చివరి వరకు చూడాలనే కాన్సెప్ట్ తో డైరెక్టర్ తీసాడు. కానీ అదే పెద్ద మైనస్ గా మారింది. ఏదీ ఒక కొలిక్కి రాని కథ, ఏదీ పూర్తవ్వని కథ, అంటు కామాలు పెట్టుకుంటూ పోవాల్సిందే అన్నట్టుగా అలా ముగించకుండానే వదిలేసారు. అది అంతగా నచ్చకపోవచ్చు.
ఒక్కో పాత్రని మలిచిన తీరుబాగున్నప్పటికి స్క్రీన్ ప్లే గజిబిజిగా ఉండటంతో అర్థం చేసుకోవడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ మొదట బాగున్నప్పటికి ఆ తర్వాత అంతగా మెప్పించలేకపోయింది. ఎడిటింగ్ పర్వాలేదు. మ్యూజిక్ సెట్ అవ్వలేదు. నిర్మాణ విలువలు పర్వాలేదనట్టుగా అనిపించాయి.
నటీనటుల పనితీరు :
కళైగా అమ్ము అభిరామి, గీతగా కీర్తి పాండియన్, నేత్రగా విద్య ప్రదీప్, నదిగా షాలిన్ జోయ, కళై నాన్నగా మయిళసామి, కళైకి అమ్మ సరళ పాత్రలో మౌనిక బాగా నటించారు. శశిగా వెట్రి ఎమ్ వి, అభిరూప్ గా అదేశ్ సుధాకర్ చక్కగా నటించారు. ఇక మిగిలిన పాత్రలు వారి పరిధి మేరకు నటించి మెప్పించారు.
ఫైనల్ గా....
కొన్ని సీన్లని దృష్ణిలో పెట్టుకొని ఫ్యామిలితో చూడకపోవడమే బెటర్. భిన్నమైన కథలని ఇష్టపడే వారికి ఇది నచ్చే అవకాశం ఉంది.
రేటింగ్ : 2 / 5
✍️. దాసరి మల్లేశ్
Also Read