క్యాన్సర్‌ని జయించి ఇండియా వచ్చిన శివన్నకు ఘన స్వాగతం!
on Jan 26, 2025
కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి డిసెంబర్‌లో ఆమెరికాలోని మియామి క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. నెలరోజులపాటు అక్కడే ఉన్న శివన్న జనవరి 26న ఇండియా తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా బెంగళూరు విమానాశ్రయంలో శివరాజ్‌కుమార్‌కు ఘన స్వాగతం లభించింది. ఇంటికి చేరే వరకు శివన్నపై పూల వర్షం కురిపించారు అభిమానులు. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వారందరికీ అభివాదం తెలిపారు. నివాసానికి చేరుకున్న తర్వాత మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.
‘చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లేందుకు మొదట భయపడ్డాను. కానీ, అక్కడికి వెళ్లిన తర్వాత నాకు నమ్మకం కలిగింది. ఈ విషయంలో మా కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందారు. చికిత్స ముందు కొంత టెన్షన్ పడ్డాను. అయితే జీవితంలో ఏం జరిగినా దాన్ని ఎదుర్కోవాల్సిందేనని నన్ను నేను సరిపెట్టుకున్నాను. ఆపరేషన్ తర్వాత కొంత విశ్రాంతి తీసుకొని నడవడం ప్రారంభించాను. క్రమేపీ నా ఆరోగ్యం మెరుగైంది. ఆ సమయంలో నా కుటుంబ సభ్యులు నాతోనే ఉన్నారు. నేను త్వరగా కోలుకోవడానికి వారు కూడా కారణం. అలాగే నేను ఆరోగ్యంగా తిరిగి రావాలని మీరంతా చేసిన ప్రార్థనలు కూడా నేను ఇలా రావడానికి దోహదపడ్డాయి. ఈ విషయంలో మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. ఇప్పుడు 131వ సినిమా కోసం ప్లాన్ చేస్తున్నాను. అలాగే రామ్‌చరణ్ సినిమా షూటింగ్‌లో కూడా త్వరలోనే జాయిన్ అవుతాను’ అని చెప్పారు శివరాజ్‌కుమార్.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
