సుందరకాండ అందించిన సుందరనాయిక
on Dec 19, 2020
విక్టరీ వెంకటేష్ కి అచ్చొచ్చిన దర్శకుల్లో కె. రాఘవేంద్రరావు ఒకరు. ఇంకా చెప్పాలంటే.. దర్శకేంద్రుడు రూపొందించిన కలియుగ పాండవులుతోనే వెంకీ కథానాయకుడిగా కెరీర్ ఆరంభించారు. అంతేకాదు.. రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే అత్యధిక చిత్రాలు (8) చేశారు. వీటిలో సింహభాగం విజయం సాధించాయి కూడా. మరో విశేషమేమిటంటే.. దర్శకేంద్రుడు కాంబినేషన్ లో వెంకీ నటించిన 8 సినిమాల్లో 4 చిత్రాల్లో నూతన నాయికలే సందడి చేశారు.
కలియుగ పాండవులుతో ఖుష్బూ తెలుగు తెరకు కథానాయకగా పరిచయమైతే.. కూలీ నంబర్ 1తో టబు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. సుందరకాండతో అపర్ణ నాయికగా పరిచయం కాగా.. సాహస వీరుడు సాగర కన్యతో శిల్పాశెట్టి తెలుగు తెరపై తొలిసారిగా మెరిశారు. విశేషమేమిటంటే.. ఖుష్బూ, టబు, శిల్పాశెట్టికి అంతకుముందే వేరే భాషల్లో నటించిన అనుభవం ఉన్నా అపర్ణకి మాత్రం ఇదే తొలి చిత్రం. అది కూడా మిగిలిన ముగ్గురితో పోలిస్తే.. అభినయానికి మెండుగా ఆస్కారమున్న పాత్ర తనకి లభించింది. అల్లరి, అమాయకత్వం, చలాకీతనం, కొంటెతనం, విషాదం.. ఇలా ఎన్నో రకాల భావోద్వేగాలను పండించే రోజా పాత్రలో అపర్ణ నటన గుర్తుండిపోతుంది. సుందరకాండ తరువాత అక్క పెత్తనం చెల్లిలి కాపురం అనే మరో తెలుగు చిత్రంలో కనిపించిన అపర్ణ.. ఆపై మళ్ళీ టాలీవుడ్ లో దర్శనమివ్వలేదు.
సుందరకాండ అందించిన ఈ ప్రతిభావంతురాలు.. ఆ ఒక్క సినిమాతోనే జీవితాంతం సరిపడ స్థాయిలో నటిగా ఎనలేని గుర్తింపుని తెచ్చుకుంది.