పవన్ కల్యాణ్ సినిమా చేస్తున్న బ్యానర్‌పై ఆయన పార్టీ లీడర్ కంప్లైంట్!
on Apr 24, 2023
పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమా చేస్తున్నారు. హరీశ్ శంకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యుల్ పూర్తయింది. కాగా పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు చెందిన ఒక లీడర్ మైత్రీ మూవీ మేకర్స్‌కు వ్యతిరేకంగా ఐటీ డిపార్ట్‌మెంట్‌కు కంప్లైంట్ చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
మైత్రీ సంస్థలో వైఎస్సార్‌సీపీ లీడర్ బాలినేని శ్రీనివాసరెడ్డి, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పెట్టుబడులు పెట్టారనీ తన ఫిర్యాదులో జనసేన నాయకుడు, విశాఖపట్నంకు చెందిన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ అంశంపై విచారణ జరపాలని కోరిన ఆయన, మైత్రీ మూవీ మేకర్స్‌పై పన్ను ఎగవేత ఆరోపణలు కూడా చేశారు.
ఆ ఫిర్యాదు ఆధారంగా వరుసగా ఐదు రోజుల పాటు మైత్రి సంస్థ కార్యాలయాల్లో ఐటీ అధికారులు దాడులుచేసి, అక్కడి రికార్డులను పరిశీలించారు. అయితే ఈ సందర్భంగా బాలినేని, తలసాని ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టారనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని సమాచారం.
ఒకవైపు మైత్రీ సంస్థలో పవన్ కల్యాణ్ ఒక సినిమా చేస్తుండగా, మరోవైపు ఆయన పార్టీ లీడర్ ఒకరు ఆ సంస్థపై పన్ను ఎగవేత ఆరోపణలు చేయడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికే ఈ ఆరోపణలకు స్పందించిన బాలినేని శ్రీనివాసరెడ్డి, తను మైత్రీ సంస్థలో పెట్టుబడులు పెట్టాననే విషయం నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు.