రేవ్ పార్టీ వీడియో వైరల్.. సీనియర్ జర్నలిస్ట్‌ని చెప్పుతో కొడతానన్న జబర్దస్త్ రోహిణి!
on Jul 13, 2024
బుల్లితెరపై పలు షోస్‌లో తన టాలెంట్‌తో అందర్నీ నవ్విస్తూ పాపులర్ అయిన నటి రోహిణి. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలు ఆమెకు ఎంతో పేరు తెచ్చాయి. అంతేకాదు, అప్పుడప్పుడూ సినిమాల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఆమధ్య బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొందంటూ ఆరోపణలు రావడం, ఆమెను అరెస్ట్ చెయ్యడం వంటి విషయాలు అందరికీ తెలిసినవే. అయితే ఇప్పుడు ఆ రేవ్ పార్టీ వ్యవహారం రోహిణికి చుట్టుకుంది. దానికి కారణం ‘ది బర్త్‌డే బోయ్’ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా రేవ్ పార్టీ జరిగినట్టు, పోలీసులు అందర్నీ అరెస్ట్ చేసినట్టు ఓ ప్రాంక్ వీడియోను చేశారు. అందులో రోహిణి కూడా పాల్గొంది. ఈమధ్య అన్ని విషయాల్లోనూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అత్యుత్సాహం చూపిస్తున్న విషయం తెలిసిందే. రోహిణి సినిమా పబ్లిసిటీ కోసం చేసిన వీడియోను చూసి అది నిజమా, ప్రాంక్ వీడియోనా అనేది తెలుసుకోకుండా యూ ట్యూబ్‌లో చర్చ పెట్టేసారు.
యూ ట్యూబ్ ఛానల్స్‌లో కనిపిస్తూ సీనియర్ జర్నలిస్టులుగా చెప్పుకునే కొందరు ముందూ వెనుకా చూడకుండా అడిగిన ప్రతి దానికీ సమాధానాలు ఇచ్చేస్తుంటారు. అది ఎన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అయినా ఆ సమయంలో తను అక్కడే ఉన్నాను అన్నంతగా చెబుతారు. ఇప్పుడు రోహిణి చేసిన ప్రాంక్ వీడియోకి సంబంధించి ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ సీనియర్ జర్నలిస్ట్ రోహిణి గురించి నోటికి వచ్చిందల్లా మాట్లాడాడు. సెలబ్రిటీలు రేవ్ పార్టీలకు వెళ్ళడం సర్వసాధారణమైపోయిందని, నిప్పు లేనిదే పొగరాదు కదా.. రోహిణి కూడా వెళ్ళే ఉంటుందని అన్నాడు.
దానిపై రోహిణి స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో ‘ఈమధ్య ది బర్త్‌డే బోయ్’ చిత్రం కోసం చేసిన రేవ్ పార్టీ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అది ప్రమోషన్స్ కోసం చేసిందని తెలుసుకున్న చాలామంది వైరల్ చేస్తున్నారు. కానీ, ఓ సీనియర్ జర్నలిస్ట్ ఓ యూ ట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఒక విషయం గురించి మాట్లాడడానికి పిలిచినపుడు అది రియల్‌గా జరిగిందా, ప్రమోషన్ కోసం చేశారా అని తెలుసుకొని మాట్లాడడం కామన్ సెన్స్. రేవ్ పార్టీలో దొరికిందని న్యూస్ వచ్చింది కదా.. నిజమే అయి ఉంటుంది. నిప్పు లేకుండా పొగ వస్తుందా అన్నారు. నేను మందు కూడా తాగను. అంటే సినిమాల్లో చేసినవన్నీ బయట చేస్తున్నట్టేనా. ఇది కాకుండా పర్సనల్‌గా మరో కామెంట్ కూడా చేశారు. ఆ అమ్మాయి సర్జరీ తర్వాత లావై పోయింది. పెళ్ళి చేసుకునే ఉద్దేశం కూడా లేదనుకుంటా.. లావుగా ఉన్నాను, నన్నెవరు పెళ్లి చేసుకుంటారులే అనుకుంటుందేమో అన్నారు. లావుగా వుంటే పెళ్ళి చేసుకోకూడదా. జర్నలిస్ట్ అంటేనే నిజానిజాలు చెప్పేవాళ్ళు. మీరు సీనియర్ జర్నలిస్ట్ ఎలా అయ్యారో నాకు అర్థం కావడం లేదు. మీరు ఖాళీగా ఉంటే ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోండి. అంతేకానీ ఏమీ తెలుసుకోకుండా ఇలా మాట్లాడకండి. మీరు సీనియర్ కాబట్టి ఇంత రెస్పెక్ట్‌గా చెబుతున్నాను. ఈ ప్లేస్‌లో వేరే వాళ్ళు ఉన్నట్టయితే చెప్పు తీసుకొని కొట్టేదాన్ని’ అని ఆవేశంగా చెప్పింది.
Also Read