
కోలీవుడ్ టాప్ హీరో విజయ్ కి ఐటీశాఖ షాకిచ్చింది. విజయ్ నివాసాలతోపాటు అతనికి చెందిన ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థపై ఏకకాలంలో దాడులు నిర్వహించింది. మొత్తం 20 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు... 24 కోట్ల నగదు, భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, నగదు, నగలపై విచారణకు రావాలని ఏజీఎస్ గ్రూప్‌కు ఐటీ అధికారులు సమన్లు జారీ చేశారు.
విజయ్ హీరోగా ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కింద బిగిల్ సినిమా తెరకెక్కింది. గతేడాది విడుదలైన ఈ సినిమా బడ్జెట్ సుమారు 120 కోట్ల రూపాయలుగా తేలింది. అయితే, ఏజీఎస్ సినిమాస్ నిర్వాహకులు పెద్దమొత్తంలో ఆదాయపు పన్నులను లెక్క చూపలేదని చెబుతున్నారు. ఈ సినిమా నిర్మాణ వ్యయం విషయంలో సరైన సమాచారాన్ని ఇవ్వలేదనే కారణంతో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నట్లు తెలిసింది. విజయ్‌తోపాటు చిత్ర నిర్మాణ సంస్థ ఏజీఎస్ సినిమాస్, ప్రముఖ ఫిల్మ్ ఫైనాన్షియర్ అన్బు చెలియన్ కార్యాలయంలోనూ ఐటీ అధికారులు సోదాలను నిర్వహించారు.
విజయ్ నివాసాలతోపాటు అతని కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించడం... భారీగా నగదు, నగలు స్వాధీనం చేసుకోవడం... తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది. బిగిల్ సినిమా ఎప్పుడో రిలీజైతే ఇఫ్పుడు దాడులు చేయమేంటని మాట్లాడుకుంటున్నారు. విజయ్‌ని కావాలనే టార్గెట్ చేశారంటూ అతని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.





.jpg)
