ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన కాలేజీ స్టూడెంట్.. ప్రపోజ్ చేసిన రజనీకాంత్!
on Dec 2, 2020
సౌత్ ఇండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాల గురించి ఫ్యాన్స్‌కు తెలియని విషయాలు తక్కువ. అలాగే ఆయన ఏ స్థాయి నుంచి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, కేవలం తమిళులకు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ఆరాధ్య నటుడిగా ఎలా ఎదిగారనే విషయమూ తెలుసు. అయితే ఆయన లవ్ స్టోరీ గురించి తెలిసిన వాళ్లు తక్కువే. ఏంటీ.. ఆయనకూ లవ్ స్టోరీ ఉందా! అని ఆశ్చర్యపోతున్నారా.. అవును. ఆయన జీవిత భాగస్వామి లతను ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయనది లవ్ ఎట్ ఫస్ట్ సైట్.. అందులోనూ తనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన ఆమెకు తొలిచూపులోనే మనసిచ్చేసి, స్పాట్లోనే ప్రపోజ్ చేసేశారు. ఆ కథేమిటంటే...
1980వ సంవత్సరం.. 'గోల్మాల్' తమిళ్ రీమేక్ 'తిల్లు ముల్లు' సినిమా చేస్తున్నారు రజనీ. ఆయన ఇంటర్వ్యూ కావాలని ఓ కాలేజీ అమ్మాయి ఆయనను అడిగారు. ఆమె పేరు లతా రంగాచారి. చెన్నైలోని ఎతిరాజ్ కాలేజ్‌లో ఇంగ్లీష్ లిటరేచర్ స్టూడెంట్. తన కాలేజీ మ్యాగజైన్ కోసం రజనీని ఇంటర్వ్యూ చేయాలని ఆమె సంకల్పించారు. రజనీ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఆయన దగ్గరకు ఆమె వచ్చారు. ఇంటర్వ్యూలో భాగంగా ప్రశ్నలు సంధిస్తూ వచ్చారు, ఆయన జవాబులిస్తూ వచ్చారు. కానీ ఆయన చూపులు ఆమె మీదే ఉన్నాయి.
అప్పటికే పలు సినిమాల్లో నటించిన ఆయన ఎన్నో లవ్ సీన్స్ చేశారు కానీ.. అవన్నీ కథలో భాగంగానే. కానీ రియల్ లైఫ్‌లో ఆయన అంతదాకా అలాంటి ఫీలింగ్ అనుభవించలేదు. లతను చూడగానే ఆయన మనసు గతి తప్పింది. ఇంటర్వ్యూ అవగానే ఆయన "నన్ను పెళ్లి చేసుకుంటావా?" అని అడిగేశారు. లతకు ఓ నిమిషం ఏమీ అర్థం కాలేదు. ఓ కాలేజీ అమ్మాయికి ఇది ఊహకు అందని విషయం. అయినా ఆమె ఎగిరి గంతేయలేదు. ముఖంపై చిరునవ్వు మెరిసింది. "మా పెద్దవాళ్లతో మాట్లాడి చెప్తా" అని చెప్పారు.
ఆ ఇద్దరికీ సంబంధించిన కామన్ అంశం.. బెంగళూరుతో కనెక్షన్. రజనీ బెంగళూరులో బస్ కండక్టర్‌గా పనిచేస్తే, లత వాళ్లకు అక్కడ ఓ సొంత ఇల్లు ఉంది. ఇంటికి వెళ్లినా రజనీ మాటలు లతను వెంటాడాయి. ఆయన మాటల్లోని నిజాయితీ ఆమెకు నచ్చింది. ఆమె మనసులోనూ ఆయనపై ప్రేమ జనించింది. అంతటి హీరోకు కూడా లత పేరేంట్స్‌ను కలిసి మాట్లాడాలంటే జంకు కలిగింది. అయితే లత అక్క సుధ అప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లాడిన విషయం ఆయన నోటీసుకు వచ్చింది. లత తల్లిదండ్రులను కలవడానికి ఆయన సాయం తీసుకున్నారు రజనీ. చర్చలు సఫలమయ్యాయి. లత తల్లిదండ్రులకూ రజనీ నచ్చారు. వారు ఓకే చెప్పేశారు.
ఇంకేముంది.. తొలిచూపులోనే తాను ప్రేమించిన అమ్మాయిని 1981 ఫిబ్రవరి 26న సంప్రదాయ బద్ధంగా తనదాన్ని చేసుకున్నారు రజనీ. తిరుమలలోని వేంకటేశ్వరస్వామి సన్నిధిలో లత మెడలో ఆయన మూడు ముళ్లు వేశారు. ఏడాది తిరిగేసరికల్లా లత పండంటి పాపకు జన్మనిచ్చారు. ఆ పాప.. ఐశ్వర్య. మరో రెండేళ్లకు సౌందర్య పుట్టింది. లతలో మంచి గాయని ఉన్నారు. కొంత కాలం గాయనిగా కెరీర్‌ను సాగించారు కూడా. 1991లో చెన్నైలో ఓ చారిటబుల్ స్కూల్‌ను నెలకొల్పిన ఆమె, నిరుపేద పిల్లలకు అందులో ఉచితంగా చదువు చెప్పిస్తూ వచ్చారు. అదీ రజనీకాంత్ లవ్ స్టోరీ!
Also Read