‘గేమ్ ఛేంజర్’ విషయంలో హైకోర్టు సీరియస్..!
on Jan 10, 2025
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన రెండు తెలుగు రాష్ట్రాలోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీని గురించి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇకపై స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి బెనిఫిట్ షోలకుగానీ, టికెట్ల రేట్లు పెంచుకోవడానికి గానీ అనుమతులు ఇవ్వబోమని అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఈ ప్రకటనతో సంక్రాంతి సినిమాలు అయోమయంలో పడ్డాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’పై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు విషయంలో సానుకూలంగా స్పందించి అనుమతులు ఇచ్చింది.
ఇదే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో చేసిన ప్రకటనను పక్కన పెట్టి ‘గేమ్ ఛేంజర్’ చిత్రానికి బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంచుకునే వీలు కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది టికెట్ ధరలు, ప్రత్యేక ప్రదర్శనలపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఓ పక్క ఇకపై పెద్ద హీరోల సినిమాలకు ప్రత్యేకమైన అనుమతులు రద్దు చేశామని చెబుతూనే స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వడం ఏమిటని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అర్థరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత, తెల్లవారుజామున షోలకు అనుమతి ఇవ్వడంపై పున: సమీక్ష చెయ్యాలని హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించిన తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు.
Also Read