రాజమౌళి కథను రిజెక్ట్ చేసిన సూర్య.. అతనే తనకు ఇన్‌స్పిరేషన్ అంటున్న దర్శకధీరుడు!
on Nov 8, 2024
దర్శకుడుగా రాజమౌళికి, హీరోగా సూర్యకు ఉన్న ఇమేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వృత్తి పట్ల వీరిద్దరికీ ఉన్న నిబద్ధత సామాన్యమైంది కాదు. తాము చేస్తున్న ప్రాజెక్ట్ కోసం ఎంత రిస్కయినా తీసుకుంటారు. అలాంటి ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది.. ఇదే ఆలోచన రాజమౌళికి కూడా వచ్చింది. సూర్యతో కలిసి సినిమా చెయ్యాలనుకున్నారు. కానీ, రాజమౌళి చెప్పిన కథ సూర్యకు నచ్చలేదు. రిజెక్ట్ చేశారు. ఆ సినిమా ‘మగధీర’. సూర్య రిజెక్ట్ చేసిన తర్వాతే రామ్‌చరణ్‌తో చేశారు రాజమౌళి. సూర్య చెయ్యాల్సిన సినిమా తను చేశానని రామ్‌చరణ్ కూడా ఒక సందర్భంలో చెప్పారు. ‘మగధీర’ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంత గొప్ప సినిమాను తను రిజెక్ట్ చేసినందుకు బాధపడుతున్నానని పలు సందర్భాల్లో సూర్య చెప్పారు.
‘కంగువా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మరోసారి ‘మగధీర’ ప్రస్తావన తీసుకొచ్చారు సూర్య. ‘సిగ్గు వదిలేసి చెబుతున్నా.. సర్ నేను ఒక ట్రైన్‌ను మిస్ అయ్యాను.. అదే రైల్వే స్టేషన్‌లో మరో ట్రైన్ కోసం ఎదురుచూస్తున్నాను’ అన్నారు సూర్య. దానిపై రాజమౌళి స్పందిస్తూ ‘అసలు ఈ పాన్ ఇండియా ఆలోచన వచ్చిందే సూర్య వల్ల. అతన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకునే నేను పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాను. ఎందుకంటే.. తమిళ్ నుంచి వచ్చినప్పటికీ తెలుగులో చక్కని మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు సూర్య. తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు. మనం కూడా అలా వెళ్లాలి అని నా నిర్మాతలకు, హీరోలకు చెబుతుండేవాడిని. ఒక సందర్భంలో సూర్య మాట్లాడుతూ నాతో పనిచేయలేకపోయానని బాధపడ్డారు. అవకాశాన్ని మిస్ చేసుకున్నానని చెప్పారు. ఛాన్స్ మిస్ చేసుకుంది అతను కాదు, నేను. సూర్య వంటి గొప్ప నటుడితో కలిసి వర్క్ చెయ్యలేకపోయాను. మేకర్స్ కంటే కథలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు సూర్య. అది నాకు బాగా నచ్చింది’ అన్నారు.
Also Read