Home

»

Latest News

ఎవరీ పండుగ సాయన్న? అతనికి, హరిహర వీరమల్లుకి ఉన్న లింక్‌ ఏమిటి?

Jul 05, 2025

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ ఫ్యాన్స్‌, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. ఎన్నో అవరోధాల్ని అధిగమించి ఎట్టకేలకు జూలై 24న థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్‌ పలుమార్లు వాయిదా పడింది. అయితే ఈసారి రిలీజ్‌ అవుతుందని అందరూ ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఈ సమయంలో ఒక వివాదం ఈ చిత్రాన్ని చుట్టు ముట్టింది. తెలంగాణలో పోరాట యోధుడుగా పేరు తెచ్చుకున్న పండుగ సాయన్న జీవిత చరిత్రను వక్రీకరించి సినిమా తీశారంటూ బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటామంటూ ఆ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాబిన్‌హుడ్‌గా పేరు తెచ్చుకున్న పండుగ సాయన్న గురించి చాలా మందికి తెలీదు. అసలు ఎవరీ పండుగ సాయన్న? అతనికి, ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి ఉన్న లింక్‌ ఏమిటి? ఎందుకిది వివాదంగా మారింది? అనే విషయాల గురించి తెలుసుకుందాం.

పండుగ సాయన్న 1860 నుండి 1900 మధ్య కాలానికి చెందినవారు. ఆరోజుల్లో తెలుగు రాబిన్‌హుడ్‌గా పేరు తెచ్చుకున్నారు. సాయన్న గ్రామీణ క్రీడల్లో ఆరితేరినవాడు. ఎంతో బలవంతుడు. 20 కేజీల గుండును అవలీలగా ఒక్క చేత్తో లేపే వాడు. ఎద్దులబండిని ఒక్క చేతితో లేపి విసిరేవాడు. ప్రజలను దోచుకుంటున్న దొరలు, దేశ్‌ముఖ్‌లు, అధికారులు, సంపన్నులను దోచుకొని పేదలకు పంచిపెట్టేవాడు. పేదల పాలిట రాబిన్‌హుడ్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ ఆధిపత్య వర్గాలు మాత్రం అతనిపై బందిపోటు అనే ముద్ర వేశాయి. అందరి దృష్టిలో అతను ఒక రాబిన్‌హుడ్‌ అయినప్పటికీ.. అతని లక్ష్యం మాత్రం వేరు. ఆనాటి నిరంకుశ నిజాం అధికారులను ప్రశ్నించాడు. వారిని ఎదిరించి, తన సొంత పాలనా వ్యవస్థను స్థాపించుకున్నాడు. ఒక సరికొత్త బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేశాడు సాయన్న. కానీ, ఇవి చూసి తట్టుకోలేని దేశముఖ్‌లు, కరణం పటేళ్లు, భూస్వాములు అప్పటి నిజాం ప్రభుత్వంతో కుమ్మక్కై సాయన్నను దారుణంగా చంపించారు. ఇప్పటికీ పండుగ సాయన్న మరణించిన రోజున వేలాదిమంది ఆయన సమాధి దగ్గరకొచ్చి నివాళులర్పిస్తారు. జయంతి ఉత్సవాలు జరుపుతారు. అతని చరిత్రను ఇప్పటికీ సజీవంగా ఉంచింది సంచార జాతులు, దళిత, బహుజన కళాకారుల కంఠాలే. వీళ్లు వూరూరా తిరుగుతూ సాయన్న చరిత్రను గానం చేశారు. మహబూబ్‌నగర్‌కు చెందిన న్యాయవాది బెక్కం జనార్ధన్‌ పండుగ సాయన్నపై ఒక నవల రాశారు. చారిత్రక ఆధారాలు తక్కువగా లభించే ఈ కథను దొరికిన ఆనవాళ్లతోనే ఉన్నతంగా రచించారు. ఇదీ స్తూలంగా పండుగ సాయన్న జీవిత చరిత్ర. 

‘హరిహర వీరమల్లు’ సినిమా విషయానికి వస్తే.. రిలీజ్‌ అయిన ట్రైలర్‌ని బట్టి పండుగ సాయన్నకు సంబంధించిన కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. ధనవంతుల్ని దోచుకొని పేదలకు సాయం చేసే లక్షణాలతోనే వీరమల్లు పాత్ర చిత్రణ జరిగింది. నిజాం నవాబుల నిరంకుశ పరిపాలనతోపాటు కోహినూర్‌ వజ్రాన్ని కూడా ఈ చిత్రంలో ప్రస్తావించారు. ట్రైలర్‌ చూస్తుంటే కథ మొత్తం కోహినూర్‌ వజ్రం చుట్టూనే తిరుగుతుంది అనిపిస్తుంది. ఆ వజ్రం కోసం గోల్కొండ నుంచి 8వ వాడిగా వీరమల్లు ఢిల్లీ బయల్దేరతాడు. అతను ఆ వజ్రాన్ని సాధించాడా లేదా అనేది కథగా కనిపిస్తోంది. 

బీసీ సంఘాలు ఆరోపిస్తున్నట్టుగా ఇందులో పండుగ సాయన్నకు సంబంధించిన కీలక అంశాలేవీ ఉన్నట్టుగా లేదు. సంపన్నులను దోచుకొని పేదలకు పంచిపెట్టే రాబిన్‌హుడ్‌ లక్షణాలు తప్ప వీరమల్లులో సాయన్న అంశ లేదు. అతని జీవిత చరిత్రతోనే ఈ సినిమా చేస్తున్నట్టుగా ప్రచారం జరగడమే ఈ వివాదం రేగడానికి కారణం కావచ్చు. హరిహర వీరమల్లు అనేది కల్పిత పాత్ర అని ఇప్పటికే చిత్ర యూనిట్‌ ప్రకటించింది. చరిత్ర పోకడలు ఉన్న ఒక జానపద చిత్రంగా హరిహర వీరమల్లు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాపై చెలరేగిన వివాదం వల్ల రిలీజ్‌కి అడ్డంకులు ఉండకపోవచ్చు. బీసీ సంఘాల నాయకులతో చర్చలు జరిపి సినిమాకి సంబంధించిన వాస్తవాలను వారికి వివరించడం ద్వారా సులువుగానే సమస్య పరిష్కారమవుతుంది అనే అభిప్రాయం అందరిలోనూ ఉంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com