అల్లు అర్జున్ అభిమాని కన్నీళ్ళకు అసలు కారణం ఇదే!
on Mar 16, 2024
పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టు అభిమానుల్లో వీరాభిమానులు వేరుగా ఉంటారు. వాళ్ళ దృష్టిలో అభిమానించే హీరోనే తమ దేవుడు. అంత అభిమానాన్ని పెంచుకునే అభిమానుల్ని చూస్తే ఆయా హీరోలకు కూడా ఎంతో ఆనందం కలుగుతుంది. ఒక్కసారైనా తన అభిమాన హీరోని కలుసుకోవాలని, మాట్లాడాలని ప్రతి అభిమానికి ఉంటుంది. అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ, ఆ అవకాశం వస్తే.. తన అభిమాన హీరో ఎదురుగా కనబడితే.. అప్పుడు అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది? అంతటి మహదానందాన్ని తట్టుకునే శక్తి అతనికి ఉంటుందా? అలాంటి ఒక అపురూపమైన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.
అల్లు అర్జున్‌ని ఓ వీరాభిమాని కలిశాడు. సడన్‌గా తన అభిమాన హీరో ఎదురుగా కనిపించడంతో ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోయాడు. ఏం చేస్తున్నాడో కూడా అతనికి అర్థం కాలేదు. అల్లు అర్జున్‌ని చూస్తూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. అతన్ని ఆపేందుకు వచ్చిన సెక్యూరిటీని అక్కడి నుంచి పంపించేశాడు బన్నీ. ఆ అభిమాని భుజంపై చేయివేసి ఓదార్చాడు. ఆ స్పర్శకు మరింత పొంగిపోయాడు ఆ అభిమాని. బన్నిని హత్తుకొని మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడు. అతన్ని ఓదార్చి, కాసేపు అతనితో ఉండి అక్కడి నుంచి వెళ్లిపోయాడు బన్నీ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. బన్ని తన అభిమానిపట్ల చూపిన ఆప్యాయతను అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు.