భూతవైద్యం నేపథ్యంలో 'ద సెవెన్త్ డే'.. ట్రైలర్ ఏం చెబుతోంది?
on Mar 2, 2021
ఎమ్మీ అవార్డ్ విన్నర్, 'మెమెంటో' (సూర్య 'గజిని' మూవీకి ఇదే ఆధారం) ఫేమ్ గయ్ పియర్స్ , మెక్సికన్ నటుడు వాధిర్ డెర్బెజ్ ప్రధాన పాత్రలు పోషించిన హారర్ ఫిల్మ్ 'ద సెవెన్త్ డే' అఫిషియల్ ట్రైలర్‌ను వర్టికల్ ఎంటర్టైన్మెంట్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్లో గయ్ పియర్స్ ఒక భూతవైద్యునిగా కనిపించాడు. కొత్తగా మతాచార్యునిగా బాధ్యతలు స్వీకరించిన యువకునికి ఆయన భూతవైద్యంలో ట్రైనింగ్ ఇస్తున్నట్లు అర్థమవుతోంది.
భూతాలు ఆవహించిన పిల్లలకు సంబంధించి కొన్ని భయంకరమైన సీన్లు ఈ ట్రైలర్లో దర్శనమిచ్చాయి. ఫాదర్ పీటర్ (గయ్ పియర్స్) ఆధ్వర్యంలో యువ మతాచార్యుడు తన తొలి భూతవైద్య చికిత్సలో సక్సెస్ అయ్యాడా లేక తనే భూతం బారిన పడ్డాడా? అనేది ఆసక్తిని రేకెత్తించే అంశం.
హారర్ ఫిల్మ్‌లో నటించడం గయ్ పియర్స్‌కు ఇదే తొలి సినిమా కాదు. ఇదివరకు ఆయన ఆంటోనియా బర్డ్ మూవీ 'రావెనస్' (1999), గ్విలెర్మో డెల్ టోరో మూవీ 'డోన్ట్ బి అఫ్రైడ్ ఆఫ్ ది డార్క్' (2010)లో నటించాడు. 'ద సెవెన్త్ డే'లో పియర్స్‌తో పాటు వాధిర్ డెర్బెజ్, స్టీఫెన్ లాంగ్ ('అవతార్' ఫేమ్), బ్రాడీ జెన్నెస్, రాబిన్ బార్ట్లెట్, కీత్ డేవిడ్ కీలక పాత్రధారులు.
జస్టిన్ పి. లాంజ్ రచన చేసి, దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 26న సెలక్ట్ చేసిన కొన్ని థియేటర్లతో పాటు వీఓడీ ప్లాట్‌ఫామ్‌పై రిలీజ్ అవుతోంది.
Also Read