మంచు మోహన్‌బాబుకి గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం చేయనున్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
on Jan 25, 2026
తెలుగు సినిమాకు మరియు ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యను అందిస్తూ సమాజానికి చేస్తున్న సేవను గుర్తించిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం లెజెండరీ యాక్టర్ డా. ఎం. మోహన్ బాబు గారికి గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డును ప్రదానం చేయనుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26, 2026న కోల్‌కతాలోని లోక్ భవన్‌లో జరిగే ఉత్సవ కార్యక్రమంలో ఈ అవార్డుని ప్రదానం చేయనున్నారు. గౌరవనీయులైన పశ్చిమ బెంగాల్ గవర్నర్, విశిష్ట అతిథుల సమక్షంలో ఈ అవార్డుని అందించనున్నారు. ఆ తర్వాత సాంప్రదాయకంగా ఎట్ హోమ్ రిసెప్షన్ జరుగుతుంది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఒక తెలుగు నటుడికి ఎక్సలెన్స్ అవార్డును ప్రదానం చేయడం ఇదే మొదటిసారి కానుంది. తెలుగు సినిమా ప్రస్తుతం భారత సాంస్కృతిక, సంప్రదాయాల్ని ప్రపంచానికి చాటి చెబుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో తెలుగు సినిమా పరిశ్రమకి యాభై ఏళ్లకు పైగా సేవలందించిన మోహన్ బాబు గారికి ఈ అవార్డుని ప్రదానం చేయడం గర్వించదగ్గ విషయం. ఈ అవార్డు మోహన్ బాబు గారి సినీ జీవితంలో ఒక అద్భుతమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ అవార్డు.. కళామతల్లికి 50 సంవత్సరాలకు పైగా ఆయన చేసిన సేవ, ఆయన నిరాడంబరమైన జీవితం, భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా ఎదగడం వరకు, ఆయన చేసిన సుదీర్ఘ ప్రయాణం, క్రమశిక్షణ, పట్టుదలకి నిదర్శనంగా నిలుస్తుంది.
ఐదు దశాబ్దాలుగా మోహన్ బాబు గారు భారతీయ సినిమాను విస్తృతమైన, వైవిధ్యభరితమైన కథల ద్వారా ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారు. నటుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా మోహన్ బాబు గారు పలు వేదికలపై అవార్డులు, ప్రశంసలు పొందారు. సినీ కెరీర్‌కు అతీతంగా విద్య, సామాజిక అభ్యున్నతికి ఆయన చేసిన కృషి రానున్న తరాలపై శాశ్వత ముద్ర వేస్తుంది. ఈ గౌరవం కేవలం వ్యక్తిగత ప్రశంస మాత్రమే కాదు, ప్రతిచోటా తెలుగు ప్రజలకు గర్వకారణమైన క్షణంగా నిలవడమే కాకుండా.. జాతీయ వేదికపై తెలుగు సినిమా స్థాయిని పునరుద్ఘాటిస్తుంది.
పశ్చిమ బెంగాల్ లోతైన కళాత్మక, సినిమా వారసత్వం కలిగిన రాష్ట్రంగా భారతదేశంలో కీర్తి ప్రతిష్టల్ని సాధించింది. బెంగాల్ ప్రభుత్వం ఇస్తున్న ఈ అవార్డు భారతీయ సంస్కృతి, సినిమాను నిర్వచించే వైవిధ్యంలో ఐక్యత స్ఫూర్తిని సూచిస్తుంది. భారతదేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ గుర్తింపు రావడంతో కళకి ఎలాంటి హద్దులు, సరిహద్దులు ఉండవని చాటి చెప్పే అద్భుతమైన జ్ఞాపకంగా నిలుస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



