'భీమా'గా గోపీచంద్.. ఇది కదా ఊర మాస్ అంటే!
on Jun 12, 2023

మాచో స్టార్ గోపీచంద్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సరైన కథ పడితే గోపీచంద్ తన నటనతో సినిమాని మరోస్థాయికి తీసుకెళ్తాడు. ముఖ్యంగా మాస్ రోల్స్ లో ఆయన స్క్రీన్ ప్రజెన్స్, యాక్టింగ్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అలాంటి గోపీచంద్ ని కొన్నేళ్లుగా పరాజయాలు ఎక్కువగా పలకరిస్తాయి. ఆయన రీసెంట్ సినిమాలు 'పక్కా కమర్షియల్', 'రామబాణం' ఘోర పరాజయాలుగా మిలిగాయి. గోపీచంద్ టాలెంట్ కి తగ్గ సినిమాలు పడట్లేదని, ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే ఆయన కొత్త సినిమా అప్డేట్ చూస్తుంటే నిజంగానే త్వరలో లెక్క సరిచేసేలాఉన్నాడు.
గోపీచంద్ తన 31వ సినిమాని కన్నడ డైరెక్టర్ ఎ.హర్ష దర్శకత్వంలో చేస్తున్నాడు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్ర టైటిల్ ని, ఫస్ట్ లుక్ ని గోపీచంద్ పుట్టినరోజు(జూన్ 12) సందర్భంగా ఈరోజు రివీల్ చేశారు. ఈ సినిమాకి 'భీమా' అనే పవర్ ఫుల్ టైటిల్ ని పెట్టారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ లో పోలీస్ యూనిఫామ్ లో గోపీచంద్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. రంకెలేస్తున్న ఎద్దులా యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా గోపీచంద్ లుక్ ఉంది. ఇలాంటి పవర్ ఫుల్ పోలీస్ పాత్రలు గోపీచంద్ కటౌట్ కి, యాక్షన్ కి సరిగ్గా సరిపోతాయి. మరి ఈ సినిమాతోనైనా గోపీచంద్ లెక్క సరిచేస్తాడేమో చూడాలి.

హర్ష కన్నడలో 'భజరంగి', 'అంజనీ పుత్ర', 'వేద' వంటి సినిమాలు చేశాడు. ఇప్పుడు 'భీమా' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమవుతున్న హర్ష.. గోపీచంద్ కి సరైన సమయంలో సరైన హిట్ ఇస్తాడేమో చూద్దాం. ఇక ఈ చిత్రానికి 'కేజీఎఫ్' ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండటం మరో విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



