'గేమ్ ఛేంజర్'కి కొత్త చిక్కులు.. తమిళనాడులో విడుదల లేదా..?
on Jan 6, 2025
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందిన 'గేమ్ ఛేంజర్' (Game Changer) మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న పాన్ ఇండియా వైడ్ గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న వేళ, తమిళ నాట ఈ సినిమాకి ఊహించని షాక్ తగిలింది. డైరెక్టర్ శంకర్ 'ఇండియన్-3'ని పూర్తి చేసే వరకు, తమిళనాడులో ఈ చిత్ర విడుదలను నిలిపివేయాలని కోరుతూ లైకా ప్రొడక్షన్స్ తమిళనాడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ని ఆశ్రయించింది. దీంతో 'గేమ్ ఛేంజర్' తమిళ్ లో విడుదలవుతుందా లేదా? అనే ఆందోళన మెగా అభిమానుల్లో నెలకొంది.
నిజానికి లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన 'ఇండియన్-2' కారణంగానే 'గేమ్ ఛేంజర్' షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. 'ఇండియన్-2', 'గేమ్ ఛేంజర్' సినిమాలను పారలల్ గా తెరకెక్కించారు శంకర్. ఎట్టకేలకు 'గేమ్ ఛేంజర్' షూటింగ్ పూర్తయ్యి, విడుదలకు సిద్ధమైన వేళ.. ఇప్పుడు 'ఇండియన్-3' కంప్లీట్ అయ్యేవరకు తమిళ్ లో రిలీజ్ చేయకూడదంటూ లైకా ప్రొడక్షన్స్ కొత్త డిమాండ్ ని తెరపైకి తీసుకొచ్చింది.
అజిత్ కుమార్ హీరోగా లైకా నిర్మిస్తున్న 'విడాముయార్చి' సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. దాంతో కావాలనే ఆ సంస్థ, సంక్రాంతికి విడుదలవుతున్న 'గేమ్ ఛేంజర్'ని టార్గెట్ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే లైకాకి.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి కానీ, ఎగ్జిబిటర్స్ నుంచి కానీ మద్దతు లభించే అవకాశం లేదు. ఎందుకంటే పొంగల్ కి తమిళ్ లో పెద్ద సినిమాలేవీ విడుదల కావట్లేదు. ఈ క్రమంలో అక్కడి థియేటర్లకు ఫీడింగ్ గేమ్ ఛేంజరే కానుంది. 'ఆర్ఆర్ఆర్'తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. మరోవైపు ఫ్లాప్ ల్లో ఉన్నప్పటికీ శంకర్ ఎప్పటికీ ఒక బ్రాండ్. ముఖ్యంగా తమిళనాట ఆయన సినిమాలకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. అందుకే 'గేమ్ ఛేంజర్'ని అక్కడి ఎగ్జిబిటర్స్ వ్యతిరేకించే అవకాశంలేదు. మరోవైపు నిర్మాత దిల్ రాజు సైతం రంగంలోకి దిగి, తమిళనాడులో 'గేమ్ ఛేంజర్' విడుదలకు ఎటువంటి అడ్డంకులు రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
Also Read