సీతారామశాస్త్రికి శ్రద్ధాంజలి ఘటించడానికి తరలివచ్చిన చిత్రసీమ
on Dec 1, 2021

తెలుగు సినిమా చిట్టచివరి లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆకస్మిక మృతితో యావత్ తెలుగు సంగీత ప్రియుల గుండెలు బద్దలయ్యాయి. తెలుగు సినిమా సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కొద్దిమంది అగ్రేసర కవుల్లో ఒకరిగా ప్రఖ్యాతి పొందిన సీతారామశాస్త్రి ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతూ, మంగళవారం శివైక్యం చెందారనే వార్తతో తెలుగు చిత్రసీమ తల్లడిల్లిపోయింది. ఆయనతో అనుబంధం ఉన్నవారితో పాటు, ఆయన గొప్పతనం తెలిసిన ప్రతి ఒక్కరూ ఆయనకు సోషల్ మీడియా ద్వారా నివాళులర్పిస్తూ వచ్చారు.
సీతారామశాస్త్రి భౌతికకాయాన్ని నిన్న ఆయన చికిత్స పొందుతూ వచ్చిన సికిందరాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌లోనే ఉంచి, ఈరోజు ఉదయం 7 గంటలకు అభిమానుల, సినీ కళాకారుల సందర్శనార్థం ఫిల్మ్‌నగర్‌లోని ఫిల్మ్‌చాంబర్ ప్రాంగణానికి తరలించారు. ఆయన భౌతికకాయం వచ్చేసరికే అనేకమంది అభిమానులు ఫిల్మ్‌చాంబర్ దగ్గర వేచిచూస్తూ ఉన్నారు. తమ అభిమాన సినీకవి పార్థివదేహాన్ని చూడగానే వారంతా కన్నీరుమున్నీరయ్యారు.
ఇక పలువురు సెలబ్రిటీలు సీతారామశాస్త్రి కడసారి చూపుకోసం తరలివచ్చారు. చిత్రసీమ అంతా తరలివచ్చిందా అన్నంతగా ఫిల్మ్‌చాంబర్ ప్రాంగణం అభిమానసంద్రంతో కిటకిటలాడింది. సీతారామశాస్త్రి పార్ధివదేహానికి నివాళులర్పించిన వారిలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, పవన్ కల్యాణ్, మహేశ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాజమౌళి, గుణశేఖర్, కీరవాణి, రాజశేఖర్, జగపతిబాబు, పరుచూరి బ్రదర్స్, సాయికుమార్, శ్రీకాంత్, నాగబాబు, తనికెళ్ల భరణి, నాని, రానా, శర్వానంద్, క్రిష్ జాగర్లమూడి, ఎస్వీ కృష్ణారెడ్డి, కె. అచ్చిరెడ్డి, రావు రమేశ్, రామజోగయ్య శాస్త్రి, సునీత తదితరులు అనేకమంది ఉన్నారు. సీతారామశాస్త్రి అంత్యక్రియలు ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో ఈరోజు మధ్యాహ్నం జరగనున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



