ఇలా చూడటం మా వల్ల కాదు.. ఓటీటీ నుంచి 'కాంతార'ను తొలగించండి!
on Nov 24, 2022
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్నట్లుగా ఉంది 'కాంతార' చిత్ర అభిమానుల పరిస్థితి. ఆ చిత్రాన్ని థియేటర్లలో చూసిన వారు, చూడనివారు అందరూ ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందా అని ఎంతగానో ఎదురుచూశారు. ఎట్టకేలకు గత అర్థరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. అయితే 'కాంతార' ఓటీటీలోకి వచ్చిందని ఆనందించే లోపే ఆ సినిమాకు ఆయువు పట్టులాంటి 'వరాహ రూపం' పాటను మార్చేశారని తెలిసి ఆడియన్స్ నిరాశచెందుతున్నారు.
'కాంతార' చిత్రం ఎంతలా ఆదరణ పొందిందో అందులోని 'వరాహ రూపం' పాట అంతకుమించి ఆదరణ పొందింది. సినిమా అంతా ఒక ఎత్తయితే 'వరాహ రూపం' పాట మరో ఎత్తు. అయితే ఆ ట్యూన్ మీద కాపీ ఆరోపణలు రావడంతో ఇప్పుడు ఓటీటీలో ఆ ట్యూన్ మార్చి కొత్త మ్యూజిక్ తో విడుదల చేసి షాకిచ్చారు మేకర్స్.
కేరళకు చెందిన 'థాయికుడమ్ బ్రిడ్జ్' అనే సంగీత బృందం 'వరాహ రూపం' పాటపై కాపీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 'వరాహ రూపం' పాట తాము రూపొందించిన 'నవరసం' పాటలా ఉందని, తమ అనుమతి లేకుండా అలా పాటని కంపోజ్ చేయడం కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించడమేనంటూ చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది. దీంతో ఆ ట్యూన్ ని మార్చి ఓటీటీలో విడుదల చేశారు మేకర్స్. ఒరిజినల్ ట్యూన్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటే, కొత్త ట్యూన్ ఆ దరిదాపుల్లో కూడా లేదని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒరిజినల్ ట్యూన్ తో రిలీజ్ చేయండి లేదా సినిమాని ఓటీటీ నుంచి తొలగించండి అంటూ నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Also Read